తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణలో పలు ఏజెన్సీ గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. మరోవైపు రాష్ట్రంపై ఆలస్యంగానైనా వరుణుడి కరుణించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైద్రాబాద్‌ను వరుణుడు రెండుమూడు రోజులుగా తడిసిముద్ద చేస్తున్నాడు. జోరు వానలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరివాహాక ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు తెలంగాణలో గోదావరి, కృష్ణ, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. 2లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో నీటిమట్టం పెరుగుతుంది. కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. జలాశయానికి 1.9 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా..1.7 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రం కుంటాల వాటర్ ఫాల్స్ జలకళతో ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. గుట్టల్లోనుంచి జాలువారుతున్న జలపాత అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story