భూమిని పోలిన కొత్త గ్రహం.. అక్కడ కూడా మనలాగే..?

విశ్వంలో భూగోళంపై కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? భూమిలా ఆవాసయోగ్యమైన ఇతర గ్రహమేదైనా ఉందా? ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు మొత్తం మానవాళి మెదళ్లను దశాబ్ధాలుగా వేధిస్తున్న ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. తొలిసారిగా దీనిపై విశ్లేషణాత్మకంగా కొత్త గ్రహం గురించి చెబుతున్నారు. సౌర వ్యవస్థ ఆవల ఓ చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న కొత్త గ్రహంపై జీవం, నీరు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
సౌర కుటుంబం వెలుపల భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో జీజే 357 డీ అనే గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ఉపగ్రహం- టెస్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల నాసా విడుదల చేసింది. సూర్యుడిలో మూడో వంతు పరిమాణం ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ జీజే 357 డీతోపాటు జీజే 357 బీ, జీజే 357 సీ అనే మరో రెండు గ్రహాలు కూడా పరిభ్రమిస్తున్నాయని గుర్తించారు. భూమితో పోలిస్తే జీజే 357 డీ ద్రవ్యరాశి ఎక్కువ. కాబట్టి దాన్ని సూపర్ ఎర్త్‌గా పరిగణిస్తారు. ఈ గ్రహంపై వాతావరణం దట్టంగా ఉందని.. భూమి తరహాలోనే అక్కడ ద్రవరూప నీరు ఉండేందుకు అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలంటున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే అత్యాధునిక టెలిస్కోపులతో ఆ గ్రహంపై జీవం ఉనికిని గుర్తించవచ్చునని చెబుతున్నారు.
చాలాకాలంగా నివాసయోగ్యంగా ఉండే గ్రహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అదే సమయంలో ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లమా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ పరిశోథనలు జరుగుతున్నాయి. మార్స్ పై భూమిని పోలిన వాతావరణం ఉన్నట్టు గుర్తించినా.. అక్కడ జీవజాడ కనిపించలేదు. తాజాగా జీజే 357 డీ అనే గ్రహం ఆశలు రేపుతోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com