రాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు

రాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు
X

ఓ వైపు వర్షాలతో అన్ని ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. కానీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్లో మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. ఇప్పడిదే ఇసుక వ్యాపారులకు వరంగా మారింది. ఇదే అదనుగా కొందరు ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రాజెక్టులోనే ఇసుక తవ్వకాలకు తెరతీశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు.

రాత్రివేళల్లో విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దాదాపు 30 ట్రాక్టర్ల ద్వారా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ 5 నుంచి 8 లోడ్‌ల వరకు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలకు వెళ్లగా ట్రాక్టర్లతో సహా పరారయ్యారు.

ఇదిలా ఉంటే శ్రీరామ్‌ సాగర్‌ డ్యాంపై రోడ్‌తో సైడ్‌వాల్‌ నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. 12 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ప్రాజెక్టులో తవ్విన ఇసుకనే వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కోసం షెట్పల్లి వద్ద ప్రభుత్వం గుర్తించిన ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. కానీ చాలా దూరం నుంచి ఇసుక తెచ్చుకోండం.. అది కూడా మైన్స్‌, రెవెన్యూ శాఖలకు సీనరేజి ఫీజు చెల్లించడం ఎందుకని ఇక్కడే ప్రాజెక్ట్‌ నుంచి ఇసుకను తవ్వి గట్టుపై డంప్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులో ఇసుక తవ్వడం, దాన్ని అభివృద్ధి పనులకు వినియోగించడం వల్ల పనులు నాసిరకంగా ఉంటున్నాయి. ప్రాజెక్టు ఇసుకలో నాణ్యత లేదని, అది వాడొద్దని.. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story