కేరళలో వరద పన్ను.. ఆ నష్టాన్ని పూడ్చాలని నిర్ణయం..

కుంభవృష్టి వర్షాలు. మేఘాలన్నీ ఒక్కసారిగా కూలినట్లు అతి భారీ వర్షాలు. ఏకంగా వారం పాటు కురిసిన అనాటి భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అయ్యింది. దాదాపు ఏడు జిల్లాలు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వరద నీటి బాధితులుగా మిగిలిపోయారు. ఇళ్లు మునిగిపోయాయి. కరెంట్ స్థంభాలు కూలిపోయాయి. నదులు, కాలువలు, ఊళ్లు ఏకం కావటంతో పాములు, తేళ్లు, మొసళ్లు ఇళ్లలోకి చేరాయి. గతేడాది ఆగస్టులో కేరళాలో కురిసిన కుంభవృష్టి వర్షాల ప్రభావం ఇది.
ఆనాటి భారీ వర్షాల ధాటికి దాదాపు 300 మంది చనిపోయారు. వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరొందల కోట్లతో సరిపెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి సాయం అందింది. అయినా..కుంభవృష్టి వర్షాలు మిగిల్చిన నష్టాన్ని పూడ్చలేకపోయాయి. కేరళ పునర్నిర్మాణానికి మరో ఐదేళ్లు పడుతుందని అంచనా వేసిన కేరళ ప్రభుత్వం.. వరద నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రజలపై వరద పన్నును అమల్లోకి తీసుకొచ్చింది.
కేరళ పునర్నిర్మాణానికి అదనపు ఆదాయాన్ని సమీకరించడానికి ప్రజలపై వరద పన్ను విధించేందుకు 2019–20 బడ్జెట్‌లో కేరళ ప్రభుత్వం తీర్మానించింది. ఈ నిర్ణయంతో వస్తు సేవలపై ఒక శాతం పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. రాబోయే రెండేళ్ల కాలానికి అమల్లోకి వచ్చే -కేరళ ఫ్లడ్ సెస్- ద్వారా ఏటా 600 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం దృష్టి సారించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పన్ను ద్వారా సమీకరించిన మొత్తం రాష్ట్ర పునర్నిర్మాణం, వరద బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తారు.
వరద పన్నుతో కేరళలో 900 రకాల నిత్యవసర సరుకుల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరల వర్తకుల సంఘం ఆందోళనకు దిగింది. వరద పన్నుతో రాష్ట్ర ప్రజలపై 12 వందల కోట్ల అదనపు భారం పడుతుందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com