పోలవరం టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం : కేంద్రమంత్రి

పోలవరం టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం : కేంద్రమంత్రి

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం. దశాబ్దాలుగా ప్రతిపాదనల వరకే పరిమితం అయిన ఈ మెగా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. విభజన హామీల్లో భాగంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. ప్రాజెక్ట్ కు శంకుస్థాపన నుంచి పూర్తి అయ్యే వరకు కేంద్రం నిధులతోనే నిర్మించాలి. కానీ, పోలవరం నిర్మాణంపై సందిగ్థత నెలకొంది.

పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే 70 శాతం పూర్తి చేశామన్నది టీడీపీ వాదన. మరో 30 శాతం పనులు పూర్తి చేస్తే ఏపీ కలల ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే..ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రాజెక్టు దక్కించుకున్న నవయుగ టెండర్ ను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రభుత్వ వాదన.

అయితే.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. ప్రతీ పైసా కేంద్రమే భరించాలి. కానీ, పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై బాంబు పేల్చింది కేంద్రం. ప్రాజెక్టు టెండర్ల రద్దుపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌.. పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయమన్నారు. శుక్రవారం ఈ అంశాన్ని గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో లేవనెత్తారు. టెండర్ రద్దుపై సభలో సమాధానం చెప్పిన కేంద్రమంత్రి షెకావత్.. టెండర్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా పడుతుందని చెప్పారు. టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.

పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలకు అప్పజెప్పిన టెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. కొత్తగా టెండర్లు పిలిచి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలంటే.. ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. పోలవరం రీ టెండర్ల వల్ల ప్రాజెక్ట్‌ ఖర్చు కచ్చితంగా పెరుగుతుందని... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు షెకావత్‌.

నామినేషన్ ప్రాతిపదికన టెండర్ అప్పజెప్పారంటూ నవయుగను పోలవరం టెండర్ నుంచి మధ్యంతరంగా రద్దు చేసినా.. మళ్లీ కొత్తగా పిలవనున్న టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనవచ్చని క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి. పనులు వేగంగా చేయకపోవడం, ఇతరత్రా వేరే కారణాలతో ఈ సంస్థను తొలగించినందున పోలవరం ప్రాజెక్టుకు తాజాగా పిలిచే టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story