నవలా నాయకి.. నటనలో మేటి.. అభినేత్రి 'వాణిశ్రీ' బర్త్‌డే స్పెషల్

నవలా నాయకి.. నటనలో మేటి.. అభినేత్రి వాణిశ్రీ బర్త్‌డే స్పెషల్

వాణిశ్రీ.. ఈ పేరు వింటే ఎన్ని స్టైల్స్ గుర్తొస్తాయో చెప్పలేం. వాణిశ్రీ కట్టు, వాణిశ్రీ బొట్టు, వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ శారీస్, ఇలా తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ స్టైలిష్ హీరోయిన్. ఆమె పరిచయం చేసినన్ని స్టైల్స్ అప్పటి వరకూ ఏ హీరోయిన్ చేయలేదు. అందుకే తను 70లనాటి ప్రేక్షకుల కలల రాణి. అహం, పొగరు కలిసిన పాత్రల్లో అచ్చంగా జీవించిన వాణిశ్రీ అంటే ఒకతరం కలలదేవత. దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన నటనా పటిమ చూపిన మేటి నటి తను. ఇవాళ వాణిశ్రీ పుట్టిన రోజు. వెన్నెల వేళలో మల్లెల పరిమళం వాణిశ్రీ నవ్వు.. ఆత్మవిశ్వాసం, ధైర్యం కలబోసిన వగరు వాణిశ్రీ చూపు.. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఆమెను ఆరాధిస్తూ అక్షరాలు అల్లుకునేవారు ఆ రోజుల్లో. అదీ వాణిశ్రీ ఫాలోయింగ్. హీరోలకు సమానమైన ఇమేజ్ ను సొంతం చేసుకుని.. ఫ్యాషన్ కే పాఠాలు నేర్పిన నటి వాణిశ్రీ. తెలుగులో అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నటించిన హీరోయిన్ తను. కె బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన వాణిశ్రీ.. ఆ స్కూల్ గర్వపడే ప్రతిభతో దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు.

తెలుగు సినిమా హీరోయిన్లలో నాటి నుంచి నేటి వరకూ వాణిశ్రీ ప్రత్యేకం. కట్టు బొట్టు, మాటా పలుకు, నడక నడత.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చూపించిన నటి తను. వెండితెరపై హీరోయిన్ అంటే ఎన్ని ఆకర్షణలకు కారణమౌతుందో అందరికీ తెలుసు. వాటిలో ఎక్కువ శాతం పరిచయం చేసిన నటి కూడా వాణిశ్రీయే. భానుమతి తర్వాత హీరోలతో పోటీపడుతూ అప్పుడప్పుడూ వారినీ డామినేట్ చేస్తూ వెండితెరపై అద్భుతప్రతిభ చూపిన అభినేత్రి వాణిశ్రీ.. కె బాలచందర్ సుఖదుఖాలులో ఒక పాత్రతో పరిచయం చేశాడు. తర్వాత మరపురాని కథతో తిరుగులేని నాయిక అయ్యే లక్షణాలన్నీ చూపించేసింది.. అటుపై అగ్రహీరోలందరి సరసనా అభినయించి.. అద్భుత విజయాలెన్నో అందుకుంది వాణిశ్రీ. వాణిశ్రీ నటనలో మనకు ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. వాణిశ్రీ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ చెబుతున్నప్పుడు వాణిశ్రీలా బిహేవ్ చేసే నటి మనకు మరొకరు కనిపించరు. అది ఆమెకే సాధ్యమైన సిగ్నేచర్. తను పాత్రలో లీనమవుతుంది. పాత్రలా ప్రవర్తిస్తుంది. అది కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. అందుకే వాణీశ్రీ నటనలో మెలోడ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంది.

హీరోయిన్లలో మాస్ హీరోయిన్ అనే మాటకు జమున తర్వాత ఆ అర్థం చెప్పిన నటిగా వాణిశ్రీని చెప్పొచ్చు. నాటి హీరోయిన్లు చాలా వరకూ సున్నితంగానే ఉండేవారు. కానీ వాణిశ్రీ అలా కాదు. తెలుగులో వచ్చిన విలేజ్ మూవీస్ లో సెన్సేషన్ సృష్టించిన దసరా బుల్లోడులో ఏఎన్నార్ కంటే వాణీశ్రీనే ఎక్కువ సెన్సేషన్ అయింది. అక్కినేని స్పీడ్ కు తగ్గ రిథమ్ తో తను చేసిన డ్యాన్సులు నేటికీ సూపర్ గానే అనిపిస్తాయి. ఈ సినిమాతో తనకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ పెరిగిందో చెప్పలేం. తన ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా.. ఏ ఆర్టిస్ట్ అయినా వాణీశ్రీ పాత్ర పరంగా ఏ మాత్రం తగ్గదు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు వాళ్లను డామినేట్ చేసిందా అనిపిస్తుంది. నవలా నాయకిగా పేరు తెచ్చుకున్న వాణిశ్రీలోని నటి గురించి చెప్పాలంటే ప్రతి సినిమా ఉదాహరణే.

డ్యూయల్ రోల్ చేయడం అనేది పెద్ద సాహసం. అది హీరోలకే ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాణిశ్రీ అలాంటి సినిమాలు చాలా చేసింది. ఆమె డ్యూయల్ రోల్ చేసిన సినిమాలన్నీ అఖండ విజయం సాధించాయి. ఇద్దరు అమ్మాయిలు, గంగ మంగ, జీవన జ్యోతి, చిలిపి కృష్ణుడు చిత్రాల్లో ఆమె ద్విపాత్రాభినయానికి ఆడియన్స్ హారతులు పట్టారు. అద్భుతమైన వేరియేషన్ తో ఆమె చూపిన నటనకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. మేకప్ విషయంలో హీరోయిన్లెంత ఇబ్బంది పడతారో తెలిసిందే. మరి ఒకే సినిమాలో డబుల్ రోల్ అంటే.. ఎంత కష్టమో వేరే చెప్పేదేముందీ.. దటీజ్ వాణీశ్రీ. వాణిశ్రీ చేసిన ద్విపాత్రాభినయాలు ఓ ట్రెండ్ నే సృష్టించాయి. ఏ సినిమాలో అయినా అలాంటి పాత్రలుంటే అందరికీ ముందు గుర్తొచ్చిన నటి తనే. కానీ పాత్రల కోసం కాకుండా కథ నచ్చితేనే కమిట్ అయ్యి.. ఆ పాత్రలను అజరామరం చేసిందామె. గంగ మంగ సినిమా ఫార్ములా ప్రకారం నడిచే కథే అయినా.. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలున్నా.. ఆ సినిమాను తన నటనతో మరో మెట్టు పైన నిలుపుతుంది వాణిశ్రీ.

ప్రతి సినిమాలోనూ సరికొత్త స్టైల్ ను ఆవిష్కరించింది వాణిశ్రీ. అయితే నటి అంటే గ్లామర్ కురిపించడమే కాదు గ్రామరూ తెలిసుండాలి. అందుకే డీ గ్లామర్ పాత్రల్లోనూ అద్భుతమైన అభినయంతో ఆశ్చర్యపరిచిందీ అభినేత్రి. అప్పటి వరకూ వాణిశ్రీని గ్లామర్ గా చూసిన వారు గోరంతదీపంలో చూసి షాక్ అయ్యారు. కానీ కథలోని బలం, ఆమె నటన వెరసి.. ఆ పాత్ర ఎంతమందికి నచ్చిందో చెప్పలేం. ఆడదంటే ఆటబొమ్మ కాదు.. ఎవరేమన్నా పడి ఉండే అబల అంతకంటే కాదనే పాత్రగా జీవించేసింది వాణిశ్రీ. ఇదే కాదు.. నాటి మహిళాప్రేక్షకులు అభిమానులు వాణిశ్రీలో తమను తాము చూసుకునే వారు. తాము రియల్ లైఫ్ లో చేయాలనుకున్న ఎన్నో విషయాలు సిల్వర్ స్క్రీన్ పై వాణిశ్రీ చేస్తుంది కాబట్టే.. తమ ఐడెంటిటీని ఆమెలో చూసుకునేవారు. ప్రేమ్ నగర్, సెక్రటరీ వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా సెక్రటరీలో వాణిశ్రీ నటన ఎంతోమంది మహిళాభిమానులకు ఇప్పటికీ విపరీతంగా నచ్చుతుంది. అలాగే ప్రేమ్ నగర్ లో ప్రేమకీ త్యాగానికి మధ్య ఆత్మగౌరవంతో ఊగిసలాడే యువతిగా సింప్లీ సూపర్బ్ అనిపిస్తుంది.

అలాగే కృష్ణవేణి సినిమాలో మధ్య తరగతి గృహిణిగా ఆమె పాత్రలో ఎన్నో భావోద్వేగాలు పలుకుతాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉండే ఎమోషన్స్, లోపాలు, కోపాలు, స్వార్థాలను ఎత్తి చూపుతూ.. సాగే ఈ సినిమాలో ఇవన్నీ చూసే ఆ ఇంటి స్త్రీగా ఆమె పాత్ర ఎన్నో విషయాలకు ప్రతీకగా నిలుస్తుంది.. ఇలా చెప్పుకుంటే పోతే వాణిశ్రీ చేసిన ప్రతి పాత్ర ఓ వైవిధ్యమైనదే అయితే.. ప్రతి సినిమాలోనూ ఆమె పాత్ర ఆత్మాభిమానం నిండినదిగానే ఉండటం మరో విశేషం. వాణిశ్రీ నిర్మించిన ఓ సినిమా ఆమె నటనకు గీటురాయిలా కనిపిస్తుంది. అందుకు కారణం దర్శకుడు శ్యామ్ బెనెగల్. భారతదేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఆయన దర్శకత్వంలో వాణిశ్రీ నిర్మించిన ఆ సినిమా అనుగ్రహం. జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో ఆమె నట విశ్వరూపాన్నే చూపింది. వైవిధ్యమైన కట్టు బొట్టులో పూర్తి డీ గ్లామర్ పాత్రలో ఆకట్టుకుంటుంది. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర ఔన్నత్యాన్ని ప్రదర్శించడం వాణిశ్రీలోని ప్రత్యేకమైన ప్రత్యేకత.

సాంఘిక చిత్రాలతో నవలానాయకిగా పేరు తెచ్చుకున్నా.. పౌరాణిక, జానపద చిత్రాల్లోనూ అలరించింది వాణిశ్రీ. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు నాటి అగ్రకథానాయకులందరితోనూ నటించింది. ఎన్టీఆర్ తో పౌరాణిక, జానపదాల్లోనూ చేసి మెప్పించింది. జమున తర్వాత సత్యభామగా అలరించింది కూడా వాణీశ్రీయే కావడం విశేషం. శ్రీ కృష్ణాంజనేయ యుద్ధంలో సత్యభామగా ఎన్టీఆర్ తో సమానమైన నటనతో ఆకట్టుకుంటుంది. భక్తి చిత్రాల్లోనూ వాణిశ్రీ మొల్ల అనిపించుకుంది. కథానాయిక మొల్ల సినిమాలో ఆమె నటనకు ఎన్టీఆర్ సైతం ముగ్ధుడైపోయాడట. అలాగే భక్త కన్నప్పలోనూ ఆమె నటన లక్షలాదిమంది అభిమానుల్ని మెప్పిస్తుంది. భక్తకన్నప్పలో కండ గెలిచింది.. అనే పాటలో డ్రమ్స్ పై చేసిన నృత్యం ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకున్నారు. అలాగే కథానాయిక మొల్లలో పద్మనాభం వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతూ పాటలో అభినయించిన విధానంలో ఎంతో మెచ్యూరిటీ చూపిస్తుంది..

70వ దశకంలో తెలుగు, తమిళ చిత్రాల్లో తిరుగులేని అగ్రకథానాయికగా వెలుగొందింది వాణిశ్రీ. సరికొత్త స్టైలింగ్ తో పాటు సమ్మోహన పరిచే నటనతో ఈ రెండు భాషల్లోనూ ఎందరో అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరించి.. తనకు పోటీ లేదని ప్రూవ్ చేసుకుంది. మొత్తంగా ప్రేమికురాలిగా, త్యాగశీలిగా, సాహసిగా, చిలిపి పిల్లగా.. బాధ్యతాయుతమైన పాత్రల్లో, భక్తురాలిగా.. ఇలా నటనలో ఎన్నో కోణాలను అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించిన వాణీశ్రీ.. ప్రభ శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి హీరోయిన్ల రాకతో కొంత వెనకబడి పోయింది. అదే టైమ్ లో పెళ్లి చేసుకుని కుటుంబ బంధంలోకి వెళ్లడంతో 70ల చివరి నాటికి హీరోయిన్ గా వాణిశ్రీ శకం ముగిసిందనే చెప్పాలి.

పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. పర్సనాలిటీ కొంత పెరిగినా అత్తపాత్రలతో అదిరిపోయే రేంజ్ లో రీఎంట్రీ ఇచ్చారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో అత్తగా రీ ఎంట్రీ ఇచ్చిన వాణీశ్రీ.. ఆ తర్వాత అత్త పాత్రలకు రోల్ మోడల్ అయిపోయారు. ఈ సినిమాలో చిరంజీవితో పోటాపోటీగా నటించి అప్పటి వరకూ ఉన్న అత్తలకు భిన్నమైన అత్తగా అవతరించింది. ఆ తర్వాత అలాంటి పాత్రల్లో ఆమె తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేం అన్నంతగా తనదైన ముద్ర వేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా ఆఫర్స్ వచ్చినా సెలెక్టివ్ గానే వెళ్లారామె. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తర్వాత చేసిన స్వాతి చినుకులులో ఆమె నటన కన్నీళ్లు పెట్టించింది.. అగ్ని, రావుగారింట్లో రౌడీ చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు, నటనతో ఆకట్టుకున్నారు.

పెంకి అత్తగా కాస్త ఎక్కువ సినిమాల్లో కనిపించినా బొబ్బిలి రాజాలో పాత్ర మళ్లీ ఎవర్ గ్రీన్. రాజేశ్వరీ దేవిగా ఆమె డైలాగ్స్ చెబుతుంటే ఆ నటనముందు ఎవరున్నా తేలిపోయారు. అయితే ఇదే తరహాదే అయినా కాస్త కొంటెదనమూ నిండి ఉన్న అత్తగా పెద్దింటి అల్లుడులో కనిపిస్తుంది. వైవిధ్యం ఎంత చూపించినా.. తెలుగు తెరపై పొగరుబోతు అత్తగా వాణిశ్రీ వేసిన ముద్ర ఇంకెవరూ చెరపలేనిది. 90ల చివరి వరకూ వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా శోభన్ బాబుతో చేసిన ఏవండీ ఆవిడవచ్చిందిలో శారదతో కలిసి వాణీశ్రీ చేసిన హంగామా మరవడం సాధ్యం కాదు. అలాగే మరోసారి అత్తగా అల్లరి అల్లుడు, బొంబాయి ప్రియుడు సినిమాల్లో అలరించారు. కానీ అనూహ్యంగా ఒళ్లు పెరుగుతుండటంతో పాటు తెలుగు సినిమాల్లో వస్తోన్న మార్పులకు అలవాటు పడలేక ఆల్మోస్ట్ కొత్త శతాబ్ధంలో మాగ్జిమం యాక్టింగ్ కు దూరమయ్యారు. 2007లో వచ్చిన భద్రాద్రిరాముడు చివరి సినిమా అనుకోవచ్చు.

సో.. తెలుగు తెరపై ఎందరు కథానాయికలు ఉన్నా.. అందర్లోకీ ప్రత్యేకమైన గుర్తింపునూ, ఇమేజ్ ను సొంతం చేసుకున్నఏకైక నటిగా వాణిశ్రీని చెప్పొచ్చు. వాణిశ్రీ తర్వాత అన్ని రకాల వైవిధ్యమైన పాత్రల్లో మరోనటి కనిపించినా ఆ పాత్రల్లో నటనలో అంత ప్రభావం కనిపించదు.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా పరిశ్రమకు దగ్గరగానే ఉన్న వాణిశ్రీ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి ఈ కళాభినేత్రికి బర్త్ డే విషెస్ చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story