కశ్మీర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

జమ్మూకశ్మీరులో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల నుంచి పెనుముప్పు పొంచి ఉందన్న కారణమో..ఇతర పాలనపరమైన నిర్ణయాల కసరత్తో తెలియదుగానీ కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జిల్లా అధికారుల నుంచి వచ్చిన సూచనలతో శ్రీనగర్ లోని నిట్ కు నిరవధిక సెలవులు ప్రకటించారు. దీంతో నిట్ లో చదువుతున్న 800 మంది విద్యార్ధులను సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. స్థానిక విద్యార్ధులను కూడా ఇళ్లకు పంపించేస్తున్నారు.
నిట్ యాజమాన్యం సెలవులు ప్రకటించటంతో రాష్ట్రేతర విద్యార్ధులకు ఇక్కట్లు తప్పటం లేదు. ఇతర రాష్ట్రాల విద్యార్ధుల కోసం బస్సులు ఏర్పాటు చేసినా..ఏం జరుగుతుందో అర్ధంగాక విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిట్ లో 130 మంది విద్యార్ధులు ఉన్నారు. తమను సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ విద్యార్ధులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. స్టూడెంట్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సీఎస్ జోషీని కోరడంతో... ఆయన ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూంచించింది.
శ్రీనగర్ నుంచి విద్యార్ధులను మూడు బస్సుల్లో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో వారికి భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి రైలులో విద్యార్థులను హైదరాబాద్ తీసుకురానున్నారు. విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని.. త్వరలోనే వారు సురక్షితంగా హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com