ధర్మపురిలో గోదావరి ఉగ్రరూపం.. సిబ్బందిపై కలెక్టర్‌ సీరియస్‌

ధర్మపురిలో  గోదావరి ఉగ్రరూపం.. సిబ్బందిపై కలెక్టర్‌ సీరియస్‌

గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి.. గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఇది. ఖరీఫ్‌కు సాగుకు ఆనందంగా సిద్ధమవుతున్న రైతులు... చెరువులకు గండి పడడంతో ఆందోళన చెందుతున్నారు.. వరద నీరు వృధాగా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులోకి, కుంటల్లోకి భారీగ వరద నీరు చేరుకుంది. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం 45 అడుగులుగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. 513 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ములుగు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో చెరువులకు మత్తడి పోస్తూ కట్టలు ప్రమాదకారంగా మారాయి. మంగపేట మండలంలోని మల్లూరు అత్తచెరువు నిండకుండాలా మారి మత్తడి దూకుతోంది. మల్లూరు అత్తచెరువు నుంచి నీరు వృధాగా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో మహబూబాబాద్‌ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గార్ల, బయ్యారం మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖరీప్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. కాకతీయులు నిర్మించిన బయ్యారం పెద్ద చెరువుకు జలకళ చేకూరింది. ఈ చెరువు కింద సుమారు 20 వేల ఎకరాలు సాగు అవుతున్నాయి.

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరీ నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ఉన్న కడెం ప్రాజెక్టు నుండి వదిలిన వరదకు తోడు.. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా గోదావరి నిండు కుండలా మారింది. జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ధర్మపురిలో నీటి మట్టాన్ని పరిశీలించారు. ఆ సమయానికి అధికారులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఎవరూ లేకపోవడంపై సీరియస్‌ అయ్యారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మలహార్‌ రావు మండలం ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మారపు చెరువుకు 2 రోజుల కిందట గండి పడడంతో నీరు మొత్తం వృధాగా పోతోంది. రెండు రోజుల నుండి నీరు వృథగా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.హైదరాబాద్‌లో ఇటీవల కురుస్తున్నవర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. దీనిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. GHMC కమిషనర్, మేయర్ స్వయంగా నగరంలో పర్యటించారు. సిటీలో 4 వేల గుంతలు పడ్డాయని బల్దియా యంత్రాంగం లెక్కతేల్చింది. ఉన్నతాధికారులు రోడ్ల మరమ్మత్తు చేయిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story