జనసేనాని పర్యటన వివరాలు..

జనసేనాని పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఓటమితో ఒకింత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన మొదట పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిద్ధాంతం బ్రిడ్జి వద్ద పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి సిద్ధాంతం గ్రామం మీదుగా పెనుగొండ, మార్టేరు, బ్రాహ్మణ చెరువు, నవుడూరు, వీరవాసరం, శృంగవృక్షం గ్రామాల మీదుగా పవన్ భీమవరం చేరుకుంటారు..
భీమవరం పట్టణంలోని ఉండి రోడ్డులో ఉన్న కోట్ల ఫంక్షన్ హాల్ లో సాయంత్రం భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎన్నికల్లో పరాజయానికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలతో జనసేన సైనికులతో మాట్లాడతారు. సోమవారం ఉదయం అల్పాహారం తరువాత పవన్ కళ్యాణ్ తాడేరు గ్రామానికి చేరుకుని.. ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన జనసైనికుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు..
తాడేరు గ్రామం నుంచి నేరుగా భీమవరంలో ఉన్న కోట్ల ఫంక్షన్ హాల్ కి చేరుకుని సోమవారం మధ్యాహ్నం నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన పార్టీ కార్యకర్త మురళీ కృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పవన్ భీమవరం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com