మూడు రాష్ట్రాల్లో రవిశేఖర్ బాధితులు.. స్కెచ్ ఇలా వేస్తాడు.. అలా చేస్తాడు

మూడు రాష్ట్రాల్లో రవిశేఖర్ బాధితులు.. స్కెచ్ ఇలా వేస్తాడు.. అలా చేస్తాడు

18 సంవత్సరాలు..మూడు రాష్ట్రాలు... 55 నేరాలు.. సోని కిడ్నాపర్ రవిశేఖర్ క్రైమ్ స్కోరు ఇది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏరియాలు మార్చుతూ జనాలను ఏమార్చేస్తూ నేరాల్లో హాఫ్ సెంచరీ దాటిపోయాడా జగజ్జంత్రీగాడు.

2001 నుంచే రవిశేఖర్ క్రైమ్ హిస్టరీ మొదలైంది. ఏపీలో తన బంధువునే మోసం చేశాడు. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అతడికి రెండు రకాల అలవాట్లు ఉన్నాయి. బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఒకటైతే.. రెండోది మహిళల్ని వేధించి లొంగదీసుకోవడం. పలు డిపార్ట్‌మెంట్ల అధికారుల పేరు చెప్పి మాట్లాడటం.. అవకతవకలు జరుగుతున్నాయని బెదిరించి.. డబ్బులు వసూలు చేసేవాడు. ఇలానే అంగన్‌వాడీ ఉద్యోగులను సరిగా పనిచేయడంలేదని వారిని బెదిరించి మోసం చేశాడు. వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు.

రైలు ప్రయాణంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుటుంబంతో పరిచయం పెంచుకున్న రవిశేఖర్.. కర్ణాటకలోని కొప్పల్‌కు వెళ్తున్నట్లు తెలుసుకొని ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత కొప్పల్‌కు వెళ్లి తన వద్ద రూ.3 కోట్లు ఉన్నాయని.. తాను భూమి కొంటానని నమ్మించిన రవిశేఖర్.. తన డబ్బు బళ్లారిలో ఉందని చెప్పాడు. కారు డ్రైవర్‌ను పంపిస్తే డబ్బు తీసుకొస్తానన్నాడు. మధ్యలో డ్రైవర్‌ను దింపి ఆ కారుతో పరారయ్యాడు. ఆ కారుతోనే పశ్చిమగోదావరి జిల్లా చేరాడు. జూన్‌ 26న సీబీఐ అధికారి అరవింద్‌ రెడ్డినని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి రూ.50వేలు వసూలు చేశాడు. జూన్‌ 30న అరవపల్లిలో ఓ స్టాల్‌ నడిపిస్తున్న వ్యక్తికి బీసీ కార్పొరేషన్‌లో రుణం ఇప్పిస్తానని ఆయన ఇంట్లో రెండు రోజులు ఆశ్రయం పొందాడు. అక్కడా రూ.20వేలు తీసుకొని మోసం చేయడంతో అక్కడా కేసు నమోదైంది.

జులై 21న తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇద్దరు మహిళలతో తాను సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి వచ్చానని.. జాబ్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ. 65వేలు వసూలు చేశాడు రవిశేఖర్. ఇద్దరిలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి వస్తూ జులై 23న హయత్‌నగర్‌లో బీఫార్మసీ యువతిని అపహరించాడు. యువతితో షాద్‌నగర్‌ మీదుగా కర్నూలు మార్గంలో కడప చేరుకున్నాడు. నెల్లూరు, విజయవాడ నగరం.. ప్రకాశం జిల్లాలో పోలీసు బృందాలు గాలిస్తున్నప్పుడు జులై 29న వాడపల్లి వద్ద ఓ దుకాణదారుడి వద్దకు వెళ్లి విజిలెన్స్‌ అధికారినని బెదిరించి రూ.85వేలు, రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం తీసుకున్నాడు. అదే ఏరియాలో నిందితుడు సంచరిస్తున్నట్టు అనుమానం వస్తే అక్కడ ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలించి పట్టుకున్నామని సీపీ తెలిపారు.

నేరాలు ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడ ముందు జాగ్రత్త వహించేవాడు రవిశేఖర్. చాలా కేసుల్లో టార్గెట్‌గా ఎవరు ఉన్నారో వారి ఫోనే వాడాడు. ఆ తరువాతి టార్గెట్‌ చేసే వ్యక్తికి ప్రస్తుత బాధితుడి ఫోన్‌ నుంచే కాల్స్‌ చేసేవాడు. దీంతో పోలీసులకు ఈ మోసగాడిని గుర్తించడం కష్టమైంది. 200 మంది సిబ్బంది వారం పది రోజుల నుంచి నిందితుడిని గాలిస్తే ఎట్టకేలకు పట్టుబడ్డాడు. కర్ణాటక కొప్పల్‌లో చోరీ చేసిన కారు, వాడపల్లి కేసులో తీసుకున్న బంగారు ఉంగరాలు, రూ.47 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు ఫోన్లు, ఎనిమిది సిమ్‌ కార్డులు పేర్కొన్నారు. మీడియాలో ఇతడి గురించి వస్తున్న కథనాలు చూసి మరికొందరు ఫిర్యాదు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story