కశ్మీర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన మోదీ సర్కార్

కశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో మోదీ సర్కారు వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఏదో జరగబోతోందీ అన్న సంకేతాలిచ్చిన కేంద్రం, ఏం జరబోతోందో మాత్రం బయటపడనివ్వలేదు. చివరి వరకు కంప్లీట్ సీక్రెట్ మెయింటైన్ చేసింది. ఐతే, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో నేరుగా నిర్ణయాలు తీసుకునే హక్కు పార్లమెంట్‌కు లేదు. విదేశీ, రక్షణ వ్యవహారాలు మినహా మిగతా అంశాలపై బిల్లులు పెట్టే అవకాశం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి రాష్ట్రపతి మార్గాన్ని ఎంచుకుంది. ముందుగా, ఆర్టికల్-370, అందులో అంతర్భాగంగా ఉన్న ఆర్టికల్-35Aలను రద్దు చేస్తూ రాష్ట్ర పతి గెజిట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి కేబినెట్ తీర్మానం లేఖను అందుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, వెంటనే ఆమోదం తెలిపారు. ఆ మరుక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్టాన్ని పార్లమెంట్‌లో పెట్టడానికి కేంద్రానికి మార్గం సుగమమైంది. పార్లమెంట్‌లో అమిత్ షా చెప్పేవరకు రాష్ట్రపతి గెజిట్ విడుదలైనట్టు ఎవరికీ తెలియలేదు. పార్లమెంట్ చర్చ పెట్టిన తర్వాతే మీడియాకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అంతకుముందు ఈ బిల్లులు చర్చకు పెట్టడానికి కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంది. ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో చర్చకు పెట్టేవరకు ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడింది. ఏదో జరుగుతుందన్న అభిప్రాయ బలంగా జనాల్లోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఏ ప్రతిపాదనలతో వస్తుందన్నది చివరిదాకా బయటకు రాకుండా జాగ్రత్తపడింది. చివరకు పార్లమెంట్ లో అమిత్ షా ప్రకటించే వరకు కూడా ఎంపీలకు దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వలేదు. నేరుగా రాజ్య సభ ఛైర్మన్ ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్‌పై హోంశాఖ సవరణ బిల్లు పెడుతుందని, సమయం లేనందున ఎంపీలకు ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయామని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com