ఆంధ్రప్రదేశ్

జగనన్న పాలనలో ఆకలి కేకలు ఉండవన్నారు.. కానీ..

జగనన్న పాలనలో ఆకలి కేకలు ఉండవన్నారు.. కానీ..
X

జగనన్న పాలనలో ఆకలి కేకలు వినిపించవని చెప్పారు.. కానీ, వచ్చీరాగానే పేదవాళ్ల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేశారు.. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..? పేదవాళ్లంతా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. సమాధానం వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు.. అన్న క్యాంటీన్ల మూసివేతపై ప్రజలు భగ్గుమంటున్నారు.

అక్షయ పాత్ర అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం.. నిండుకోవడం అనే ప్రశ్నే ఉండదు.. కానీ, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పాత్ర ఖాళీ అయిపోయింది.. పేదవాడి ఆకలిని అపహాస్యం చేసింది.. ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే పథకం మూతబడి ఐదు రోజులుదాటింది.. ఇన్నాళ్లూ పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్‌ ప్రాంగణాలన్నీ చిన్నబోయి కనబడుతున్నాయి.. అన్న క్యాంటీన్లనే నమ్ముకున్న ఎంతో మంది పేదవారు ఆకలితో ఆలమటిస్తున్నారు.. వడ్డించేవారు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

పేదల కడుపు నింపే సంక్షేమ పథకాలకు మంగళం పాడటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు. అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. విజయవాడలో కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ప్రజలే ఉద్యమిస్తారని ఆయన అన్నారు.

విశాఖ జిల్లాలో 26 క్యాంటీన్లు ఉండగా.. ఒక్కో క్యాంటీన్‌లో 8 మంది వరకు పనిచేసే వారు.. క్యాంటీన్లు మూతబడటంతో వారంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు మా జీవితాలకు భరోసా ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. అన్న క్యాంటీన్లను నమ్ముకుని ఇన్నాళ్లు కుటుంబాలను పోషించుకున్నామని, ఉపాధి లేకుండా చేస్తే తమ గతేంటని వాపోతున్నారు.

అటు అన్న క్యాంటీన్ల మూసివేతపై పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.. క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగ యువత, కూలీలు, నిరుపేదల కోసం టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.. చంద్రబాబు కంటే గొప్ప పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అన్నదాతా సుఖీభవ అనిపించుకోవాల్సిన ప్రభుత్వం ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరిపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES