సర్పంచులకు అధికారాలేవీ?.. అక్కడి పిల్లలు చదువుకోవద్దా?

సర్పంచులకు అధికారాలేవీ?.. అక్కడి పిల్లలు చదువుకోవద్దా?
X

జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుతో.... మోదీ సర్కారు దూకుడు పెంచింది. రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.... లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.... లోక్‌సభకు బిల్లులు సమర్పించారు. వీటిపై ఇవాళ చర్చ జరగనుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభలో ఆమోదించుకుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో రాజ్యసభలో ఈ కీలక బిల్లును ఆమోదించుకుంది....

బీఎస్పీ, ఆప్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీతో పాటు పలు విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. అయితే ఓటింగ్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ కేంద్రానికి షాక్‌ ఇవ్వడం విశేషం. ఒక్క జేడీయూ మినహా ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ బిల్లు విషయంలో కేంద్రానికి అండగా నిలిచాయి. బిల్లును కాంగ్రెస్‌, ఎస్పీ, జేడీయూ, డీఎండీకే, డీఎంకే, సీపీఎం, పీడీపీ, ఎన్సీపీ, ఎన్సీ తదితర పార్టీలు వ్యతిరేకించాయి.

ఈ సందర్భంగా రాజ్యసభలో అమిత్‌షా, గులాంనబీ ఆజాద్‌ మధ్య మాటల యుద్ధం నడించింది. తెలంగాణ అంశంపై ఇద్దరు నేతలు వాదోపవాదాలు చేసుకున్నారు. హడావుడిగా ఏపీ, తెలంగాణను విడగొట్టారని గుర్తు చేశారు అమిత్‌షా. "ప్రైవేటు రంగాల్లో పెద్దపెద్ద ఆస్పత్రులు వస్తున్నాయి. కానీ, కశ్మీర్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే... అక్కడా ఆర్టికల్‌ 370 అడ్డంకిగా నిలిచింది. దేశమంతటా 14 ఏళ్లలోపు బాలబాలికలకు చదువు ఒక హక్కుగా ఉంది. ఈ హక్కు కశ్మీర్‌లో మాత్రం అమలు కావడంలేదు. కారణం... ఆర్టికల్‌ 370, స్థానిక సంస్థలకు పూర్తి హక్కులను ఇచ్చే రాజ్యాంగ సవరణలు అన్ని రాష్ట్రాలకు వర్తించాయి కానీ, కశ్మీర్‌కు మాత్రం వర్తించలేదు. కశ్మీర్‌లో 40వేల మంది సర్పంచుల హక్కులను హరించారు. దీనికి కారణం... ఆర్టికల్‌ 370. " అంటూ అమిత్‌షా ఉద్వేగంతో ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలపై ఆజాద్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరిని వారించారు చైర్మన్‌ వెంకయ్యనాయుడు. సభను ఇవాల్టికి వాయిదా వేశారు ఆయన.

మరోవైపు... జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లును లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టారు అమిత్‌ షా. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారాయన. ఈ సందర్భంగా. . జమ్మూకశ్మీర్‌ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తాత్కాలికమేనన్నారు అమిత్‌షా. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంగా ఏర్పాటవుతుందన్నారు.

లోక్‌సభలో ఈ బిల్లుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధి, పాక్ ఆక్రమిత కశ్మీర్-POK వరకు వర్తిస్తుందన్నారు. మొత్తానికి 370 ఆర్టికల్‌ విజయవంతంగా రద్దు చేసిన మోదీ సర్కారు... కశ్మీర్‌ విభజన బిల్లుపై ఇవాళ పూర్తిస్థాయిలో లోక్‌సభ చర్చించనుంది. అనంతరం ఓటింగ్‌ జరగనుంది..

Tags

Next Story