ఎన్‌ఎంసీ వద్దు.. ఉధృతంగా జూడాల సమ్మె

ఎన్‌ఎంసీ వద్దు..   ఉధృతంగా జూడాల సమ్మె

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో జూడాల సమ్మె మరింత ఉధృతమవుతోంది. పలు చోట్ల రిలే దీక్షలు చేస్తున్నారు.. ఇప్పటికే ఓపీ సేవలు నిలిచిపోగా.. కొన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలూ నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేస్తున్నారు.

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ వైద్యులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థి వైద్యులంతా సమ్మెలో పాల్గొంటున్నారు.. దీంతో ఓపీలు నిలిచిపోవడంతోపాటు ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలందించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. జూనియర్‌ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో అత్యవసర విభాగాలతోపాటు క్యాజువాలిటీల్లో అదనంగా సీనియర్‌ వైద్యులు, నర్సులను నియమించారు.

అటు విశాఖలో జీవీఎంసీ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.. ఎన్‌ఎంసీ బిల్లును రద్దు చేయాల్సిందేనని వారంతా పట్టుబడుతున్నారు.. బిల్లు కారణంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగం నిర్వీర్యమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా తాము సమ్మెలో ఉంటూ నిరసనలు తెలుపుతున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. జూడాలు చేస్తున్న దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు తెలిపింది.. జూడాలతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. తూర్పుగోదావరి, కృష్ణా సహా ఏపీ వ్యాప్తంగా జూడాలు కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల దీక్షలు కొనసాగుతున్నాయి. విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. NMC బిల్లులో సవరణలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రంపై కేసీఆర్ సర్కారు ఒత్తిడి తేవాలన్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోనూ జూడాలు ఆందోళన బాట పట్టారు.. ఆరు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థుల్లో ఒకరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు.. అయితే, కేంద్రం స్పందించి ఎన్‌ఎంసీ బిల్లులో సవరణలు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.. తామంతా భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నామని.. ఆ ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story