అక్కడ ఏ కంట చూసినా కన్నీరు జలపాతమై ఉబికివస్తోంది

అక్కడ ఏ కంట చూసినా కన్నీరు జలపాతమై ఉబికివస్తోంది

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామంలో రోదనలు మిన్నంటుతున్నాయి.. ఒకే గ్రామానికి చెందిన 13 మంది కూలీలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఊరంతా కన్నీరు పెడుతోంది. మృతుల కుటుంబాల్లో నెలకొన్న విషాదంతో కొత్తపల్లి గ్రామం గొల్లుముంటోంది. పలువురు రాజకీయ నేతలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు శివారులోని వ్యవసాయ పొలాల్లో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.. ఆ పరిసరాల్లో విషాద ఛాయలు అలము కున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగానికి తోడు అధికారుల అలసత్వంతో ఇంకెంత మంది ప్రాణాలు పోవాలని స్థానికులు నిలదీస్తున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులను పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు పలు పార్టీల నేతలు కొత్తపల్లి గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఓదార్చి ఆర్థిక సాయం చేశారు. మరోవైపు పరామర్శకు వచ్చిన రాజకీయ నేతలకు మృతుల కుటుంబ సభ్యులు తమ గోడు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story