గోదావరి ప్రవాహాన్ని చూసి పులకించిన కేసీఆర్‌

గోదావరి ప్రవాహాన్ని చూసి పులకించిన  కేసీఆర్‌

రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని కేసీఆర్‌ పేర్కొన్నారు.. అడ్డంకులను అధిగమించి అద్భుతాన్ని ఆవిష్కరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి.. హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ధర్మపురి ఆలయంలో పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు కేసీఆర్‌. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు వెళ్లిన కేసీఆర్‌.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరిని నదిని హెలికాఫ్టర్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి. దాదాపు 12 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎగువకు ఎత్తిపోశారు అధికారులు. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మేడిగడ్డ బ్యారేజ్‌, గోలివాడ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అక్కడే గోదావరికి పూజలు చేసి.. వాయినం సమర్పించారు. అనంతరం నాణేలను నదీమ తల్లికి సమర్పించారు. మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుంచి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ప్రాణహిత నుంచి లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టును అనుకున్న స్థాయిలో విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసిన అధికారులను అభినందించారు సీఎం. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని.. అద్భుత జీవనది దృశ్యాన్ని సాక్షాత్కరింపజేస్తోందని అన్నారు. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచిందన్న ముఖ్యమంత్రి... ఇది ఎవరూ ఊహించని ఘనత అని చెప్పారు. తెలంగాణ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని కేసీఆర్‌ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని చెప్పారు. రైతుల కోసం ఎంత కరెంట్ బిల్లులైనా భరించేందుకు సిద్ధమని.. కొందరు చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై కేసీఆర్‌మండిపడ్డారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీఎం కేసీఆర్ ఆశీర్వచనాలు అందుకున్నారు. ధర్మపురిని గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ధర్మపురి పట్టణానికి 10 కోట్లు మంజూరు చేస్తామని.. ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story