ఆమె కారణంగానే భారతిని హత్య చేశారు : తల్లిదండ్రులు

ఆమె కారణంగానే భారతిని హత్య చేశారు : తల్లిదండ్రులు

కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ మధు ప్రకాశ్ భార్య భారతి డెత్ మిస్టరీగా మారింది. చీరతో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయిందనేది మధు ప్రకాశ్, అతడి కుటుంబసభ్యుల వర్షన్. కానీ భర్తే హత్య చేశాడనేది భారతి కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ కేసులో నిజా నిజాలు తేల్చడానికి పోలీసులు మధు ప్రకాశ్‌ని అరెస్ట్ చేశారు..

మధు ప్రకాశ్, భారతి దంపతులు హైదరాబాద్ మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం సాయంత్రం భారతి ఉరివేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు మధు ప్రకాశ్ తండ్రి. వెంటనే గుంటూరు నుంచి బయలు దేరారు భారతి కుటుంబసభ్యులు. ఉదయం వాళ్లంతా వచ్చేసరికే భారతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. దీంతో భారతి తల్లిదండ్రులు, సోదరుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన పుట్టా లక్ష్మణరావు, తిరుమలకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద కూతురు భారతి గుంటూరులో బీటెక్ పూర్తి చేసింది. లండన్‌లో ఎంబీయే చేసింది. దీని కోసం ఐదేళ్లు ఆమె అక్కడే ఉంది. కానీ మధు ప్రకాశ్‌తో ప్రేమ కారణంగా ఆమె ఇంటికి తిరిగొచ్చింది. తల్లిదండ్రులు ఆమెను మధుప్రకాశ్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోనే ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లిలో 15 లక్షల కట్నం, 30 తులాల బంగారం కట్నం కింద ఇచ్చారు. ఆ తర్వాత మరో 15 లక్షలు ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. మొదట కాపురం సజావుగానే సాగింది. కానీ ఏడాది క్రితం మధు ప్రకాశ్ తనతోపాటే సీరియల్‌లో నటించే మరో యువతి మోజులోపడి భారతిని నిర్లక్ష్యం చేసినట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆమె కారణంగానే భారతిని వేధించి హత్య చేసినట్లు ఆక్షేపిస్తున్నారు.

మణికొండలోని పంచవటి కాలనీలో నివాసం ఉంటున్నారు. మధుప్రకాష్ సిరియల్‌లో నటిస్తుండగా, భారతి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇంతలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అయితే తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నాడు భారతి సోదరుడు సాయి. భర్త, ఆమె అత్తమామలే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నాడు.

భారతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మధు ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించినట్లు చెప్పారు రాయదుర్గం ఇన్స్‌పెక్టర్ రవీందర్.

అటు మధు ప్రకాశ్ మాత్రం... భారతియే ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు చెప్పాడు. గతంలో చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్‌ల ద్వారా బెదిరించేదని అంటున్నాడు. గతంలో తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడు మధు ప్రకాశ్. మధు ప్రకాష్ బాహుబలితో పాటు అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ప్రస్తుతం ఓ ఛానల్‌లో ప్రసారమవుతున్న కుంకుమ పువ్వు సీరియల్‌లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిజా నిజాలు తేల్చే పనిలో పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story