ప్రవీణ్‌లాగే...ఆ దోషులకు త్వరగా శిక్ష పడాలంటే..

ప్రవీణ్‌లాగే...ఆ దోషులకు త్వరగా శిక్ష పడాలంటే..

వరంగల్‌లో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆ దుర్మార్గుడు కనిపిస్తే చంపేయాలన్న కసితో రగిలిపోయారు. పసిమొగ్గను చిదిమేసినవాడిని ఉరి తీయాల్సిందేనంటూ నినదించారు. సరిగ్గా పైశాచిక ఘటన జరిగిన 51 రోజుల్లోనే సంచలన తీర్పును వెల్లడించింది వరంగల్ జిల్లా కోర్టు. ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడే కిరాతకులకు ఇదో హెచ్చరిక అంటున్నారు.

దోషికి మరణ శిక్ష పడింది. మరి ఇకనైనా దారుణాలు ఆగుతాయా? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు తగ్గిపోతాయా? చిన్నారిపై అత్యాచారం, హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న వరంగల్ పోలీసులు... రెండు నెలలు తిరగకుండానే ఆధారాలు కోర్టు ముందు పెట్టి ఉరిశిక్ష వేయించేలా కృషి చేశారు. మరి ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన మిగతా దోషులకు ఎందుకు శిక్షలు పడడం లేదు? దేశవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ముందుకు కదలని పరిస్థితి.

యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్‌ సీరియల్‌ హత్యలు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి... పాడుబడ్డ బావిలో పడేసిన ఘటన అందరిని ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన శ్రీనివాస్‌రెడ్డికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష ఖరారు కాలేదు. ముగ్గురు బాలికలను చంపింది తానే అని ఒప్పుకున్నాడు. అన్ని ఆధారాలు దొరికాయి. కానీ ఇప్పటి వరకు శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష ఖరారు కాలేదు.

ఇదే కాదు ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు కుల్దీప్ సెంగార్ అరాచకాలు అన్నీఇన్నీ కావు. అత్యాచార ఆరోపణలే కాదు, పోలీసు ఆఫీసర్లపై హత్యాయత్నం చేసిన ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఆధారాలున్నా.. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్‌కు ఎలాంటి శిక్ష ఖరారు కాలేదు. వరంగల్ ప్రవీణ్‌లాగే...దోషులకు త్వరగా శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు లేకపోవడమే శిక్ష ఆలస్యానికి కారణమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story