భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే కాపాడాలి - గంగూలీ

భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే కాపాడాలి - గంగూలీ

భారత క్రికెట్‌లో వివాదాలకు తెరపడడం లేదు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌వార్ కొన సాగుతోందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా ద్రవిడ్ వ్యవహారం రగడ రాజేసింది. మిస్టర్ డిపెండబుల్‌ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది.

ద్రవిడ్‌కు నోటీసులపై మాజీ క్రికెటర్లు గరంగరమయ్యారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. వార్తల్లో నిలవడానికే నోటీసులు ఇచ్చారని సెటైర్లు వేశాడు. భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించాడు. విరుద్ద ప్రయోజనాల పేరుతో నోటీసులు ఇవ్వడం, వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిందని మండిపడ్డాడు. ఇక, ఆ భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

స్పిన్నర్ హర్బజన్‌సింగ్ కూడా ద్రవిడ్‌కు మద్ధతు తెలిపాడు. ద్రవిడ్ లాంటి లెజెండ్‌కు నోటీసులు ఇవ్వడం అవమానకరమని భజ్జీ భగ్గుమన్నాడు. భారత క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్లలో ద్రవిడ్ ఒకడని కితాబిచ్చాడు. ఈ నోటీసుల పర్వం ఎక్కడికి దారి తీస్తుందో తెలీదని ఆందోళన వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌ మెరుగుపడడానికి ద్రవిడ్ లాంటి వారి సేవలు అవసరమని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా కొనసాగుతున్నాడు. ఇండియా సిమెంట్స్‌ సంస్థలో వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో, విరుద్ధ ప్రయోజనాల కింద బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌, ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గతంలో కూడా ఇదే వివాదంతో ఐపీఎల్ మెంటార్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. మరి, ఈ నోటీసులపై మిస్టర్ డిపెండబుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story