విస్తారంగా వర్షాలు.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపెడుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలోని ఏజెన్సీల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలం కొర్లపొదర్ లో కల్వర్ట్ కొట్టుకుపోవడంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లిలో జనజీవనం అస్తవ్యవస్తమైంది. మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. గరిష్ట నీటి మట్టం 140 అడుగులు కాగా, 136 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు.
వర్షాలకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట ధర్మవరం బజారు వీధిలో ఓ పురాతన మిద్దె కూలిపోయింది. ఇందులో ఉన్న సన్యాసిరావు దంపతులను స్థానిక యువకులు రక్షించారు. స్వల్ప గాయాలైన వీరిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది. గోదావరి ఉగ్రరూపంతో దేవిపట్నంతో పట్నం మండలంలో గ్రామాలు నీటిలోనే మగ్గుతున్నాయి. జనం బిక్కబిక్కుమంటూ కాలం గుడుపుతున్నారు. అనేక లంక గ్రామాలకు నిత్యావసరాలు అందడం లేదు.
అటు పోలవరానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో పాత పోలవరం ముంపు గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. రాత్రి వేళల్లో కరెంట్ పోతే చాలా ఇబ్బందిపడుతున్నారు. చింతూరు వద్ద శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలచిపోయాయి. వీఆర్ పురం, చింతూరు మండలాల మధ్యలో దాదాపు 30 గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి.
కోనసీమలో గోదావరి వరద లంక రైతు గుండెల్లో దడ పుట్టిస్తోంది. భూముల్లో వేసుకున్న అంతర పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతన్నలు లబోదిబో అంటున్నారు. అరటి, జామ, మిర్చి, వంగ, దొండ, తమలపాకు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా తమ పంటలను పరిశీలించడానికి రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోనసీమలో పాము కాట్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమలాపురం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రోజుకు పదుల సంఖ్యలో బాధితులు క్యూ కడ్తున్నారు. ప్రభుత్వం లంక గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపుల్లో పాము కాటు నివారణ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి పొంగి పొర్లుతోంది. దీంతో విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లా దోయికళ్లు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వరదలకు రైలు పట్టాలు ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.దీంతో ట్రాక్ పునరుద్దరించేంత వరకు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com