భారీ వర్షాలు.. కోటి రూపాయలకు పైగా వేతనాలను కోల్పోయిన కార్మికులు

భారీ వర్షాలు.. కోటి రూపాయలకు పైగా వేతనాలను కోల్పోయిన కార్మికులు

భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 40 గేట్లను ఎత్తి 2లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. అటు అన్నారం బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీలు నీరు ఉంది. ఇన్ ప్లో 79 వేల క్యూసెక్కులు వస్తోంది. అధికారులు 17 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.

నిజామాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిరికొండ, భీంగల్‌, గోనుగొప్పుల, కొండాపూర్, కప్పలవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్‌ జిల్లాలోని కాకతీయుల కాలం నాటి రామప్ప, లక్నవరం సరస్సులు నిండు కుండలా మారాయి. ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో వాగులు, పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. ఏటూరునాగారం మండలంలోని షా పల్లి దగ్గర జీడి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో షాపల్లి, దొడ్ంల, కొండయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మంగపేట మండలంలోని తిమ్మాపూర్‌ వద్ద ముసలమ్మ వాగు పొంగడంతో 40 మంది కూలీలు వాగు అవతలి వైపు చిక్కుకున్నారు. 6 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కూలీలను గమనించిన తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. గోవిందరావుపేట మండలం పస్రా నుంచి మేడారం వెళ్లే మార్గంలో ముత్తాపురం వాగు ఉప్పొంగడంతో మేడారానికి వెళ్లిన 15 మంది భక్తులు ఒడ్డుకు అవతల చిక్కుకుపోయారు. పస్రా సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ మహేంద్ర, డీఎస్పీ విజయసారథి తాడు సహాయంతో వారిని సురక్షితంగా వాగు అవతల వైపునకుతీసుకొచ్చారు. ఇక జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోలెవల్ కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వందల ఎకరాల పంట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వానలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. పంట పోలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వేల ఎకరాల వరి , ప్రత్తి పంటలు నీటమునిగాయి. అటు మల్హర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రోజుకి 4వేల టన్ను బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 403 అడుగులకు చేరగా అధికారులు మూడు గేట్ల ద్వారా 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెర సాని అందాలను తిలకించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు 27 గేట్లు ఉండగా, 25 గేట్లు పూర్తిగా ఎత్తి లక్షా 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. అటు సింగరేణి గౌతమ్‌ పూర్‌ ఓపెన్ కాస్ట్ గనిలోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కొత్తగూడెం రీజియన్‌ పరిధిలోని సింగరేణి కార్మికులు కోటి రూపాలయలకుపైగా తమ వేతనాలను కూడా కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story