తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎంసీ బిల్లుపై భగ్గుమన్న వైద్య సిబ్బంది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NMC బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వైద్యుల ఆందోళనలు ఉధృతమయ్యమాయి. దేశవ్యాప్త వైద్య సేవల బంద్ సందర్భంగా ఒంగోలులో వైద్యులు, వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేశారు. ఒంగోలులోని జిల్లా ఆస్పత్రి ముందు చేస్తున్న దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును ఉపయోగించుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు రోడ్డెక్కారు. చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి గేట్లు మూసివేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
NMC బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. వరుసగా 8వ రోజు కూడా డాక్టర్లు విధులు బహిష్కరించారు. సమ్మెలో భాగంగా ఆస్పత్రి ఆవరణలో జూడాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌తో పాటు, పారా మెడికల్ అసోషియేషన్లు మద్దతు తెలిపాయి. బిల్లును రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు ప్రభుత్వాస్పత్రికి జూడాల సమ్మె ఎఫెక్ట్ పడింది. సరైన సమయానికి వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగం, ప్రధాన వార్డులను పట్టించుకునే వారే కరువయ్యారు. రోగులకు ట్రైనింగ్ నర్సులే వైద్యం చేస్తున్నారు.
ఎన్‌ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఒక రోజు ప్రైవేట్ ఆస్పత్రుల బంద్‌ను నిర్వహించారు. స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com