హై అలర్ట్.. ఉగ్రముప్పు హెచ్చరికలతో అప్రమత్తమైన..

ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారం మేరకు వివిధ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 19 ఎయిర్ పోర్టులను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
ఎయిర్‌పోర్టులకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది.
ఉగ్రముప్పు హెచ్చరికలతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. వివిధ జోన్లలో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పంజాబ్‌లో జైషే, లష్కరే ఉగ్ర మూకలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో వారం క్రితం కొందరు టెర్రరిస్టుల కదలికలను పసిగట్టినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి.
ఉగ్రవాదుల కదలికలు పెరగడం, నిఘా సంస్థలు హెచ్చరించడంతో పంజాబ్ పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు చేపట్టాలని.... సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిపై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షలు జరిపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో... దీనికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా.. నిషేధం విధించింది పంజాబ్ ప్రభుత్వం. ఏకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం.. పుల్వామాలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో.. దేశవ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేసింది కేంద్రం. రాష్ట్రాల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com