తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన రాక్షసుడికి మరణ శిక్ష

తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన రాక్షసుడికి మరణ శిక్ష

అభం శుభం తెలియని పసి మొగ్గని నెలల ప్రాయంలోనే తుంచేసిన కిరాతకుడికి.. మరణశాసనం రాసింది న్యాయస్థానం.. తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన నరరూప రాక్షసుడికి అందరూ కోరుకున్న శిక్ష పడింది.

కళ్లు తెరిచి లోకాన్ని కూడా చూడలేని వయసు.. బాధ, సంతోషం ఏమీ తెలియని ప్రాయం.. అమ్మా అని ఏడవలేని వయసు.. ఏం పాపం చేసింది ఆ చిన్నారి.. కన్ను మిన్ను కానక కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు ప్రవీణ్‌.. పసి మొగ్గపై పాశవికంగా అత్యాచారం చేశాడు. అక్కడితో సంతృప్తి చెందని రాక్షసుడు చిన్నారిని హత్య చేసి.. ఓ అమ్మకు గర్భశోకాన్ని మిగిల్చాడు. మనుషులపై నమ్మకం లేకుండా చేశాడు.

వరంగల్‌ జిల్లా హన్మకొండ రెడ్డి కాలనీలో జరిగిన ఈ పైశాచిక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 48 రోజుల కిందట ఇంటి డాబా మీద తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. ప్రవీణ్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. మానవత్వాన్ని ప్రశ్నించిన ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story