ఆంధ్రప్రదేశ్

ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది - లోకేష్

ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది - లోకేష్
X

ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్‌ సహా టీడీపీ నేతలు.. బాధితులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. మేమున్నామంటూ వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. గోదావరి ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గోదావరి పోటెత్తడంతో అనేక గ్రామాలు పది రోజులుగా జలదిగ్భందంలోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో బాధితుల గోడు వినేందుకు, వరద పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు ముందుకు కదిలారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రెండ్రోజులుగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ముంపు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోనూ లోకేష్‌ నేతృత్వంలోని టీడీపీ బృందం పర్యటించింది.. పోచమ్మ గండి నుంచి లాంచీలో బయలుదేరి దేవీపట్నం చేరుకున్నారు. అక్కడ కొండపై ఉన్న పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం దేవీపట్నం గ్రామంలో బోట్లపై ప్రయాణించిన లోకేష్‌.. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమ కష్టాలను ఆయన ముందు ఏకరవు పెట్టారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోకేష్‌ ఆరోపించారు.

అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన నారా లోకేష్‌.. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల నీటమునిగిన పంటలను లోకష్ పరిశీలించారు. కొన్ని చోట్ల మోకాళ్లకుపైగా లోతు నీళ్లున్నా ఏమాత్రం లెక్కచేయకుండా లోకేష్‌ వరద నీటిలోనే నడుచుకుంటూ వెళ్లి బాధితులను కలుసుకున్నారు. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES