మనసున్న 'మల్లన్న' సారు.. గుండెనొప్పిని భరిస్తూ బ్యాంకు దగ్గర ఉచితంగా..

మనసున్న మల్లన్న సారు.. గుండెనొప్పిని భరిస్తూ బ్యాంకు దగ్గర ఉచితంగా..

రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతూనే కాళ్ల నొప్పులు పలకరిస్తాయి. అనారోగ్య సమస్యలు ఏం చేయాలన్నా అడ్డంకిగా మారుతుంటాయి. గుండెకి ఓ సారి రిపేరు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. సాయింత్రం అయితే దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్లి తన వయసు ఉన్న వారితో కాలక్షేపం. ఇంట్లో మనవడు, మనవరాలితో ముచ్చట్లు. ఇంతకంటే ఇంకేం ఉంటుంది. శేష జీవితాన్ని హాయిగా గడపడం.. ఒకరి మీద ఆధారపడుతూ జీవితాన్ని వెళ్లదీయడం.. ఇంతేనా.. ఇంతకంటే ఆలోచించలేమా.. ఆసరా కోరుకునే వయసులో మరొకరికి ఆసరా కావాలనుకున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన మల్లన్న మాష్టారు. 39 సంవత్సరాలపాటు పిల్లలకు పాఠాలు చెప్పి ఆనందాన్నే పొందారు కానీ ఏనాడూ అలుపన్నమాటే ఎరుగరు.

Also Watch :

పెద్దగోపులారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. 1959 నుంచి 2007 వరకు ఉపాధ్యాయుడిగా విధులు కొనసాగించారు. పదవీ విరమణ చేసిన మరునాటి నుంచే మళ్లీ విధుల్లో జాయినైపోయారు. సిన్సియర్ స్టూడెంలా రోజూ స్కూలుకు వెళ్లి వచ్చే విద్యార్థిలా మారి పోయారు మల్లన్న మాష్టారు. అయితే ఈ సారి మాష్టారిగా కాకుండా తన సేవలు పదిమందికి.. ముఖ్యంగా అక్షరాలు రాని నిరక్షరాస్యులకు అందించాలనుకున్నారు. అందుకు ఊళ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందు కూర్చుని బ్యాంకుకు వచ్చే నిరక్షరాస్యులకు దరఖాస్తులు, ఓచర్లు రాసివ్వడం మొదలు పెట్టారు. మొదట్లో బ్యాంకు ముందున్న మెట్లపై కూర్చుని ఫారాలు నింపేవారు మాష్టారు.

ఆయన సేవలను గుర్తించిన బ్యాంకు అధికారులు బ్యాంకు ముందు ఒక టేబుల్‌ని, కుర్చీని ఏర్పాటు చేశారు. గత పన్నెండేళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ బ్యాంకు తెరవకముందే క్యారేజీ తీసుకుని అక్కడికి వెళ్లిపోతారు. మళ్లీ బ్యాంకు మూసేవరకు అక్కడే ఉంచి వచ్చి పోయే కస్టమర్లకు ఓచర్లు రాయడం.. పేదవారికి, వృద్ధులకు తగిన సహాయం అందించం.. బ్యాంకుకు సంబంధించిన పధకాలు ఏమైనా ఉంటే వారికి వివరించడం వంటివి చేస్తుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన పధకాల గురించి కూడా వారికి తెలియజేస్తుంటారు. మంచి మనసున్న ఈ మాష్టారి గుండె ఓ సారి మొరాయించింది. అయినా బ్యాంకుకు సెలవు దినాలు చూసుకుని హైదరాబాద్ వెళ్లి చెకప్‌లు చేయించుకుంటారు.

తాను ఒక్కరోజు లేకున్నా సామాన్యులు ఇబ్బందులు పడతారనేది ఆయన భావన. మల్లన్న మాష్టారి ప్రజా సేవను గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్పవాన్ని పురస్కరించుకుని 2015 జూన్ 2న ఉత్తమ సంఘసేవకుడిగా సన్మానించి రూ.11వేల నగదు పురస్కారాన్ని అందజేసింది. ఆ నగదుని కూడా మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు తన సేవలు కొనసాగిస్తానంటారు మాష్టారు. తానిలా చేయగలుగుతున్నానంటే భార్య శకుంతల, పిల్లలు కిరణ్, నరేంద్రల సహకారం మరువలేనిదని అంటారాయన. మల్లన్న సార్ చేస్తున్న కృషి అభినందనీయం. పదిమందికీ ఆదర్శనీయం.

Tags

Read MoreRead Less
Next Story