తెలంగాణ సచివాలయ తరలింపు ప్రక్రియ వేగవంతం

తెలంగాణ సచివాలయ తరలింపు ప్రక్రియ వేగవంతం

విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. కోర్టులో కేసులు నడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మాటంటే మాటే అంటోంది.. కొత్త సచివాలయ నిర్మాణం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.. ఇందులో భాగంగా కీలకమైన సచివాలయ తరలింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. పాలనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విభాగాలన్నిటినీ తాత్కాలిక కార్యాలయాల్లోకి షిఫ్ట్‌ చేస్తున్నారు.. పలు కీలక విభాగాలకు సంబంధించి రికార్డులు, ఫర్నిచర్‌, టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్స్‌ తరలింపు ప్రక్రియ శేరవేగంగా జరుగుతోంది.

ఆగస్టు 15 నాటికి సచివాలయ తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.. బుధవారం నుంచే అధికారికంగా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చాంబర్‌ను షిఫ్ట్‌ చేశారు.. ఆ శాఖను కూడా పూర్తిస్థాయిలో ఎర్రమంజిల్‌కు తరలించారు.. మత్స్యశాఖ విభాగాన్ని కూడా తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.. వచ్చే మంగళవారం నాటికి బీఆర్కే భవన్‌లో కీలకమైన పరిపాలన విభాగాల కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎస్‌ ఎస్‌కే జోషీ అధికారులను ఆదేశించారు.. శనివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఆలోగా తరలింపు ప్రక్రియ పూర్తిచేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఆర్థిక శాఖ కార్యాలయాలను తరలించనున్నారు. చీఫ్‌ సెక్రటరీ ఛాంబర్‌తోపాటు, ఇతర ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఛాంబర్లను బీఆర్కే భవన్‌లో సిద్ధం చేస్తున్నారు.. ఇదే సమయంలో పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తంగా సచివాయలంలోని కీలకమైన ఏ, బీ, సీ, డీ బ్లాకుల్లో ఉన్న అన్ని విభాగాలను బీఆర్కే భవన్‌తోపాటు ఇతర హెచ్‌వోడీ కార్యాలయాలకు తరలించే పనిలో అధికారులున్నారు.. ఇవి పూర్తయిన వెంటనే మంత్రుల ఛాంబర్లను తరలించనున్నారు. తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడున్న సచివాలయాన్ని ఎలా కూల్చివేయాలన్న దానిపై దృష్టిపెట్టనుంది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story