ఆంధ్రప్రదేశ్

వీడని వరదలు.. ఇళ్లలోకి విషసర్పాలు

వీడని వరదలు.. ఇళ్లలోకి విషసర్పాలు
X

ఉభయగోదావరి జిల్లాలను వరదలు వీడడం లేదు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నది పరివాహక ప్రాంతాల గ్రామస్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. గత 8 రోజులుగా వరదలతో తీవ్ర ఇబ్బందులు నరకయాతన పడుతున్నారు జనం. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద ఉధృతితో ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాలు ఇంకా వాననీటిలోనే నానుతున్నాయి. గత 10 రోజులుగా గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో కోనసీమలోని అప్పనపల్లి, జి.పెదపూడి, ముక్తేశ్వరం గ్రామాల్లోని కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది. బూరుగులంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక సహా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు మర పడవలు, నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వేలూరుపాడు మండలంలోని ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించారు.

అటు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో గోదారి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో లంకగ్రామాలు, పంటపొలాలు అన్ని నీటిమునిగాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ఇళ్లను మొత్తం వరద నీరు చుట్టుముట్టింది. ఎటు వెళ్లలేక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు ముంపు బాధితులు. నియోజకవర్గంలోని ఠాణేలంక, గురజాపులంక, కూనాలంక, చింతపల్లిలంక, పోగాకులంక, గోగుల్లంక, భైరవలంక తోపాటు చుట్టుపక్కల లంక గ్రామాల్లో జనం భయంతో కాలం వెల్లదీస్తున్నారు.

ఇక దేవీపట్నం మండలాన్ని కూడా వరద ఊపిరి సలపకుండా చేస్తోంది. మండలంలోని గ్రామాలు మొత్తం నదీమయంగా మారిపోయాయి. మండలంలో తొయ్యేరు, పూడిపల్లి తోపాటు మొత్తం 36 గ్రామాలు గత 8 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండగా.. దిగువన ఆచంట, యలమంచిలి మండలాల్లోని 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రెండు జిల్లాలను ముంచెత్తిన వరద ముంపు ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇళ్లన్ని నీట మునగడంతో విష సర్పాల భయంతో వణికిపోతున్నారు. మరోవైపు తమను అధికారులు పట్టించుకోవడం లేదని.. సాయం అందడం లేదని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి అని బాధితులు వాపోతున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. అడ్డతీగల మండలం కొచ్చావారివీధిలో భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఇదే జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై నడిచి వెళ్తున్న నమీర్‌బాషా, షేక్‌ రెహ్మాన్‌లు ప్రవాహంలో కొట్టుకుపోగా... గమనించిన స్థానికులు ఒకరిని రక్షించారు.

గత మూడు రోజులగా శ్రీకాకుళం జిల్లాల్లోనూ వరద పోటెత్తింది. జిల్లాతో పాటు ఎగువ కురుస్తున్న వర్షాలకు వంశాధార, నాగావళి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నది పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. అయితే గత రెండు రోజుల కంటే కాస్తా వరద ఉధృతి తగ్గడంతో పరివాహక గ్రామస్తులు ఊపిరి పిల్చుకున్నారు.

ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపినిచ్చినా వరద తీవ్రత మాత్రం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో ఏజెన్సీలో వరదలు పోటెత్తాయి. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 150 ఎకరాల మేర పంటపొలాలు నీటమునిగాయి. వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో సమీప ప్రాంతాల పంటపొలాలు నీటిపాలయ్యాయి.

Next Story

RELATED STORIES