ఆవుల మృత్యుఘోష వెనుక అసలు నిజం

కృష్ణాజిల్లా తాడేపల్లి గోశాల ఆవుల మృతి కలకలం రేపుతోంది. ఒకేసారి 106 మృతి చెందడంతో నిర్వహాకుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పశుసంవర్థక శాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయించారు. ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించి.. విషతుల్య ఆహారం తీసుకోవడమే కారణమని నిర్ధారించారు. అయితే పూర్తి రిపోర్ట్‌ రావడానికి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.

ఆవును గోమాతగా పూజించే చోట ఈ దారుణం జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోశాలలో అడుగడునా నిర్లక్ష్యమే. తొంభై ఏళ్లుగా నడుస్తోన్న గోశాలలో 1500 ఆవులు ఉన్నా.. నిర్వహణ అస్తవ్యస్థం. అపరిశుభ్ర వాతావరణంలో ఆవులను పెంచుతున్నారు. గోవుల మృతితో గోశాల నిర్వాకం బయట పడింది. ఆవుల మృతిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం టాక్సిసిటి ఉన్నట్టు తేలింది. విషతుల్యం అయిన ఆహారం తినడం కారణంగానే ముక్కులోంచి రక్తం వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. పోస్టుమార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప.. ఇతర పదార్థాలేవి లేవని తేల్చారు.

పచ్చగడ్డి, దాణా, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించమంటున్నారు పశు సంవర్థక శాఖ అధికారులు. నాలుగు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో గోవుల మృతిపై నివేదిక వస్తుంది అంటున్నారు పశు సంవర్ధకశాఖ ఏడీ దామోదర్‌..ఒకేరోజు 106 గోవులు మృతి చెందడంతో నిర్వాహకులు కళ్లు తెరిచారు. గోశాల మొత్తం శుభ్ర పరుస్తున్నారు. ఆగమేఘాల మీద క్లీన్‌ చేయిస్తున్నారు.ఈ గోశాలలో ఇంకా వెయ్యికిపైగా గోవులు ఉన్నాయి. నిర్వాహకులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మిగతా వాటికి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ ఘటనపై అధికారులు కఠినచర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుల డిమాండ్.

Tags

Read MoreRead Less
Next Story