కిలో పచ్చిమిర్చి రూ.300 , కొత్తిమీర కట్ట రూ. 400..

ఊళ్లు చెరువులయ్యాయి.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వరదలు ముంచెత్తుతున్నాయి.. కుంభవృష్టి ప్రజల ప్రాణాలు తీస్తోంది.. కుండపోత వర్షాలు, ఉప్పొంగుతున్న వాగులు, నదులు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. మొన్నటి వరకు ముంబైని ముంచెత్తిన వానలు.. ఇప్పుడు సాంగ్లీ, కొల్హాపూర్, పూణె ప్రాంతాలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి ఇప్పటికే 30 మంది మృతిచెందారు.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అటు రెస్క్యూ బృందాలు నిరంతరం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.. ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వందకుపైగా బోట్లను అందుబాటులో ఉంచారు.. అటు అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు.
ఓ వైపు వరదలతో జనజీవనం అస్తవ్యస్తం కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోగాలు వ్యాపిస్తుండడం మరింత భయపెడుతున్నాయి. రోగులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు పంపించింది. అలాగే మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. విశాఖపట్నం నుంచి అదనపు నేవి సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడణవీస్ కొల్హాపూర్, సాంగ్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో మరణించిన మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తాగునీటి వసతి, విద్యుత్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు సీఎం చెప్పారు.
వరదల ఉదృతి, కొండ చరియలు విరిగిపడడంతో బెంగళూరు వంటి జాతీయ రహదారులపై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఒకవైపు జనం వానలు, వరదలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు ముంబై, థానే, పుణె ప్రాంతాల్లో పాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక కొత్తిమీర కట్ట 400 రూపాయలకు అమ్ముతుండగా, 70 రూపాయలు ఉండే కిలో పచ్చిమిర్చి 300 రూపాయలకు చేరింది. ఇక మిగతా కూరగాయల ధరలు ఇదే రేంజ్‌లో పెరిగిపోయాయి. దీంతో వరద బాధితులు నిత్యావసర వస్తులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com