పనుల్లేవు, పూట గడిచే మార్గం లేదు.. ప్రభుత్వంపై ఆగ్రహం..

తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమను వరద ముంపు వెంటాడుతూనే ఉంది. ధవళేశ్వరం వద్ద వరద తగ్గడంతో 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నా.. లంకలు మాత్రం ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలోని శివాయిలంక, పొట్టిలంక, పాశర్లపూడిలంక, వాడ్రేవుపల్లి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అప్పన్నపల్లి కాజ్‌వేపై గల్లంతయిన యువకుల్లో ఒకరి మృతదేహాం బయటపడింది. అటు, నిత్యావసరాల కోసం ప్రమాదమని తెలిసినా నాటుపడవల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు.
రోజులు గడుస్తున్నా తమను పట్టించుకునే వారే లేకుండా పోయారంటూ ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంచినీళ్లు, పాలప్యాకెట్లకు కూడా దిక్కులేక తాము అల్లాడుతున్నామంటున్నారు. శివాయిలంక, నాగుల్లంక, తొత్తరమూడి, వీరవల్లిపాలెం, శ్రీరాంపేటలో.. పేదలంతా పస్తులుండాల్సి వస్తోంది. వర్షాలకు పనుల్లేక, ఇంట్లో పూట గడిచే మార్గం లేక దయనీయంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం కనీసం తమవైపు చూడడం లేదని వారంతా ఆగ్రహంతో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com