అందాల కేరళ కకావికలం.. ఎటు చూసినా నీరే..

కేరళపై వరుణుడు పగబట్టాడు. గత ఏడాది భయంకరమైన వర్షాలు-వరదలతో దెబ్బకొట్టిన వరుణుడు మరోసారి కుంభవృష్టి కురిపిస్తున్నాడు. రోజులు తరబడి పడుతున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. భారీ వర్షాలతో కేరళలోని 8 జిల్లాలు దెబ్బతిన్నాయి. వాయనాడ్, కన్నూరు, కాసర్‌గోడ్, కోజీకోడ్, మలప్పురం జిల్లాలు సర్వనాశనమయ్యాయి. కుండ పోత వాన, ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదలతో ఊళ్లు, చెరువులు ఏకమయ్యాయి. ఎటు చూసినా నీరే తప్ప.. ఊరన్నది కనిపించకుండాపోయింది. అన్ని ప్రాజెక్టులు, జలా శయాలు నిండుకుండల్లా మారాయి. తిరువనంతపురంలోని అరువిక్కర డ్యామ్, పాలక్కాడ్‌లోని మంగళం డ్యామ్, పథనంతిట్టలోని మనియర్ బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తేశా రు. వయనాడ్‌లోని బనసురసాగర్ డ్యాం నిండటంతో 4 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. మణిమాల, మీనాచల్, మూవత్తుపుళ, చలియార్, పెరియార్, వలపట్టణం, పంబ నదులు ప్రమాదరకర స్థాయి దాటి ప్రవహిస్తుండంతో ఏ క్షణాన ఏమవుతుందోననన్న టెన్షన్ కనిపిస్తోంది.
వయనాడ్‌లో లక్షా 25 వేల మంది, కోజికోడ్‌లో 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 56 వేల కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యా యి. వయనాడ్, మలప్పురం జిల్లాల్లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 13 వందలకు పైగా పునరా వాస కేంద్రాల్లో 3 లక్షల మంది తలదాచుకుంటున్నారు. సహాయ చర్యల కోసం NDRF, నేవీ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారులు కూడా రంగంలోకి దిగారు. ఇళ్లలోనే ఉండిపోయిన వారికి ఆహారపొట్లాలు అందించారు. బోట్లపై తిరుగుతూ బాధితులకు సహాయం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడు తోంది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. వరదలతో అతలాకుతలమైన కేరళలో రాహుల్ పర్యటించారు. సొంత నియోజకవర్గం వయనాడ్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాల ధాటికి వయనాడ్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, వయనాడ్‌కు వెళ్లారు. వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కర్ణాటకలోనూ వర్షాలు, వరదల తీవ్రత కొనసాగుతోంది. ఉడుపి, చిక్‌మగళూరు, ధార్వాడ్, శివమొగ్గ, బెళగావితో పాటు కోస్టల్ కర్ణాటకలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండడంతో డ్యామ్ నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. కాబిని, తారక, నాగు డ్యామ్‌లు కూడా నిండుకుండల్లా మారాయి. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్‌మగళూరు, కొడగు, హసన్ జిల్లాల్లో సోమవారం వరకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సక్లేశ్‌పూర్- సుబ్రమణ్య మధ్య రైలు పట్టాలపై కొండచరియలు విరిగి పడటంతో ఆ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి.
కర్ణాటకవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. బంట్వాల్‌లో కేంద్ర మాజీ మంత్రి జనార్థన్ పుజారి కుటుంబం వరదల్లో చిక్కుకుంది. దీంతో ఆ కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కు ఈనెల 15 వరకు సెలవు ప్రకటించారు. ఉత్తర కన్నడలో వర్షాల వల్ల 6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం యడియూరప్ప తెలిపారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఉన్నతాధికారులతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో చేప ట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో కుంభవృష్టితో కురిసింది. భారీ వర్షాలతో ప్రధాన డ్యామ్‌లు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన 11 మందిని వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సర్దార్ సరోవర్ డ్యామ్, భోపాల్‌లోని బడా తలాబ్‌లలో నీటి మట్టం భారీగా పెరిగింది. వరద నీరు పోటెత్తడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో బెల్ఘార్, కంధమాళ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com