తాతాజీకి కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా టీవీ5 రిపోర్టర్ తాతాజీ అంత్యక్రియలు కాకినాడలో ముగిశాయి. వృత్తి పట్ల నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన తాతాజీ ఇక లేడన్న వార్త... జీర్ణించుకోలేకపోతున్న టీవీ 5 కుటుంబం..ఆయనకు కన్నీటి వీడ్కోలు చెప్పింది.
తూర్పు గోదావరి జిల్లా టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మరణవార్త... టీవీ5 కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తాతాజీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన్ను కాపాడేందుకు.. అటుగా వెళ్తున్న జవాన్లు సైతం తీవ్రంగా ప్రయత్నించారు. హుటాహుటిన ఆసుపత్రి తీసుకెళ్లి బతికిచేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. తాతాజీకి భార్య ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కులా ఉన్న తాతాజీ చనిపోవడంతో.. కుటుంబసభ్యుల్ని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.
ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి తాతాజీని కాపాడేందుకు టీవీ5 యాజమాన్యం అన్నిప్రయత్నాలు చేసింది. రాజమండ్రిలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేసింది. అయితే వెంటిలేటర్‌పై ఉన్న తాతాజీకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఊపిరి ఆగిపోయింది. నిన్నటి వరకూ వరదల కవరేజ్‌లో బెస్ట్ అనిపించుకున్న వ్యక్తి.. ఇవాళ మనమధ్య లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది టీవీ5 కుటుంబం. ఛైర్మన్ BR నాయుడు రాజమండ్రి వెళ్లి.. తాతాజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్, జీఎంసీ హరీష్ సహా పలువురు నేతలు.. శ్రద్ధాంజలి ఘటించారు....
తాతాజీ మృతికి టీవీ5 ఛానల్ యాజమాన్యం, సిబ్బంది నివాళులు అర్పించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని సంతాప సభ నిర్వహించారు. ఎండీ రవీంద్రనాథ్, వీసీ సురేంద్రనాథ్, డైరెక్టర్ బలవంతరెడ్డి, ఎడిటర్ దినేష్ ఆకుల, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయ రావిపాటి. బిజినెస్ ఎడిటర్ వసంత్ తో పాటు టీవీ5 ఉద్యోగులు తాతాజీకి నివాళులు అర్పించారు. తాతాజీ లాంటి మరి వ్యక్తి దూరమవడం దురదృష్టకరమన్నారు ఎండీ రవీంద్రనాథ్.
తాతాజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మరణం బాధాకరమైందంటూ ట్వీట్ చేశారు. తాతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు చంద్రబాబు. అటు తాతాజీ మృతి పట్ల సంతాపం తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాతాజీ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామన్నారులోకేష్. తాతాజీ మృతి చెందడం చాలా బాధాకరమంటూ ట్వీట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.తాతాజీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తాతాజీ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.మంత్రి కురసాల కన్నబాబు కూడా తాతాజీ మృతి పట్ల సంతాపం తెలిపారు.
సంతాప కార్యక్రమంలో సీఐ, ఎస్సైతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.తాతాజీకి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తాతాజీ మరణవార్త ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను షాక్‌కు గురిచేసింది. ముమ్మడివరం ఎలక్ట్రానిక్ మీడియా సంఘం నివాళులు అర్పించింది.
కాకినాడలో తాతాజీ అంత్యక్రియలు ముగిశాయి. టీవీ5 యాజమాన్యంతో పాటు సిబ్బంది, జిల్లా అధికారులు, రాజకీయనేతలు స్నేహితులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com