ఈనెల 18న బీజేపీలోకి పెద్దఎత్తున చేరికలు

ఈనెల 18న బీజేపీలోకి పెద్దఎత్తున చేరికలు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ నేతలు వీలుచిక్కినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో బలపడేందుకు పెద్ద ఎత్తున సభ్యత్వనమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా స్వయంగా వచ్చి మరీ తెలంగాణ నుంచి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుందా పార్టీ. సెప్టెంబర్‌17న తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు..ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని చెప్పారు.

తెలంగాణలో 36 లక్షల సభ్యత్వాన్ని సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ.. పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈనెల 18న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్లాన్‌చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, పలు పార్టీలకు చెందిన నేతలు కాషాయకండువ కప్పుకోనున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్, కేటీఆరే లక్ష్యంగా లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌తో ఉంటే తెలంగాణ వాదులు.. లేకుంటే ఆంధ్రా తొత్తులా అంటూ ఫైర్ అయ్యారు. మజ్లిస్‌ను కట్టడి చేసే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు లక్ష్మణ్. అటు అమిత్‌షా కూడా తెలంగాణపై స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలంటూ.. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్‌తో సమరానికి సై అంటోంది కమలదళం.

Tags

Read MoreRead Less
Next Story