శాంతించిన గోదారి.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..

శాంతించిన గోదారి.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..

గోదావరి శాంతించింది.. పదిహేను రోజులుగా లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి సాధారణ స్థాయికి చేరుకుంది.. గోదావరి వరదలతో తూర్పుగోదావరి జిల్లాలో 153 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే, వరద ఉధృతి తగ్గినా రాజమహేంద్రవరంలోని బ్రిడ్జి లంక, కేదార్లంక ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సీతానగరం మండలం ములకల్లంక 15 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సీతానగరం, రాజమహేంద్రవరం వచ్చేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇప్పటికీ పడవలనే ఆశ్రయిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గడంతో ఇళ్లు, రహదారులపై బురద పేరుకుపోయింది.. ఏ.వీరవరం, తొయ్యేరు గ్రామాల్లో రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. చింతూరు -వరరామచంద్రపురం రహదారిపై బురద పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అటు లంక గ్రామాలలోని ఇళ్లు వరద నీటితో నిండిపోవడంతో వారంతా ఇళ్లలోని బురద తొలగించుకునే పనిలో ఉన్నారు. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలో బురద భారీగా పేరుకుపోయింది..

వరద తగ్గడంతో నష్టం అంచనాల్లో అధికారులున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 12,060 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 4,468 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 219 ఇళ్లు, 943 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు కట్టారు. అయితే, పంటల నష్టం 40 వేల ఎకరాలకుపైగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. వరదల కారణంగా కోనసీమలోని లంక గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటమునిగాయి. సుమారు 20 వేల ఎకరాల్లో మునగ, పచ్చిమిర్చి, ఆనబ, వంగ, టమాటా, బెండ, కాకర వంటి పంటలు పూర్తిగా పాడయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

వాన గండం ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడం లేదు.. పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వివరించింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలోని కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగనరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగాల్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే ఎపిలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సెప్టెంబరులో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో శృంగవరపుకోటలో 2.8 సెంమీటర్ల వర్షం కురిసింది.. ఇచ్చాపురం, గజపతినగరం 1.7 సెంటీమీటర్లు విజయనగరంలో 1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story