క్రికెట్ ఆటలో గొడవ.. విద్యార్థి మృతి..

క్రికెట్ ఆటలో జరిగిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పాతర కరసా ప్రాంతంలో జరిగింది. విజయ్, సాయి అనే ఇద్దరు విద్యార్ధులు రెండు టీంలుగా ఏర్పడి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ్ టీం గెలిచింది. మూడో మ్యాచ్ సైతం గెలిచే అవకాశం ఉండటంతో సాయి.. గొడవకు దిగాడు. మాటా మాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయి... విజయ్ కడుపులో బలంగా కొట్టాడు. ఆ తర్వాత బ్యాట్‌తోనూ కొట్టినట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆ బాధ భరించలేని విజయ్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చివరికి స్నేహితుల సహాయంతో అతను ఇంటికి చేరుకున్నాడు. అయితే కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో.. ఆసుపత్రికి తరలించారు విజయ్ తల్లిదండ్రులు. అయితే.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు విజయ్. సాయి వల్లే తమ కుమారుడి చనిపోయాడంటున్నారు విజయ్ తల్లిదండ్రులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com