మద్యానికి బానిసైన తల్లి.. బిడ్డను వెయ్యికి విక్రయించాలని..

మద్యానికి బానిసైన తల్లి.. బిడ్డను వెయ్యికి విక్రయించాలని..

ఆకలేస్తే అమ్మా అని అరవలేదు.. బాధ వస్తే నాన్నా అంటూ పిలవలేదు. పూర్తిగా ఏడాది కూడా నిండ లేదు.. అభం శుభం తెలియని 8 నెలల బిడ్డ కన్న తల్లిదండ్రులు ఉండి కూడా అనాథ అయ్యింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మే తన బిడ్డను అమ్మకానికి పెట్టేసింది..

నవమాసాలు మోసి కష్టపడి కన్న బిడ్డను కనీసం.. తొమ్మిది నెలలు కూడా చూసుకోలేకపోయింది. కేవలం వెయ్యి రూపాయలకు తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. భర్తతో గొడవలు కారణంగా మద్యానికి బానిసై కన్న బిడ్డను విక్రయించే ప్రయత్నం చేసింది. ఈ దారుణ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వరంగల్‌ బస్టాండ్‌లో చోటుచేసుకుంది.

జనగామ జిల్లా పెంబర్తిలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్న పెన్నింటి లింగం, సుజాతలకు 8 నెలల కిందట ఓ పాప పుట్టింది. అప్పటికే లింగంకు మరో మహిళతో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో సుజాత, లింగంల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా సుజాత మద్యానికి బానిసైంది. ఆదివారం అతిగా మద్యం సేవించడంతో సుజాతపై లింగం చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సుజాత సోమవారం పెంబర్తి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి వరంగల్‌ కు చేరుకుంది.

వరంగల్‌లోని బస్టాండ్‌కు చేరుకున్న ఆమె మద్యం మత్తులో నిద్రించగా 7 నెలల పాప ఏడుస్తున్నా పట్టించుకోలేదు. రెండ్రోజులుగా చంటి బిడ్డతో బస్టాండ్‌లో ఉన్న సుజాతను గస్తీ పోలీసు సిబ్బంది గమనిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆమె తన బాబును వెయ్యికి విక్రయించేందుకు యత్నిస్తుండగా వారు అడ్డుకుని సీడబ్ల్యూసీ అధికారులకు అప్పజెప్పారు. సీడబ్ల్యూసీ అధికారులు ఐసీపీఎస్‌ అధికారుల సౌజన్యంతో హన్మకొండలోని బాలరక్ష భవన్‌కు సుజాత, పాపను తరలించారు. భర్త లింగంకు సమాచారం అందించి, కౌన్సెలింగ్‌ తరువాత స్వధార్‌ హోంకు తరలించారు. అయితే, పాప ఆరోగ్యం బాగోలేక ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చానని ఆమె చెబుతోంది.. దర్యాప్తు తరువాత శిశు సంక్షేమ శాఖ అధికారులకు పాపను అప్పగించారు పోలీసులు.

Tags

Next Story