గుడ్డు పేలింది.. ముఖం కాలింది

గుడ్డు పేలింది.. ముఖం కాలింది

టైమ్ బాగోపోతే కర్రే పామై కాటేస్తుందంటారు.. లేకపోతే గుడ్డు బాంబులా పేలడం ఏమిటి.. ముఖం కాలడం ఏమిటి.. అదృష్టం.. అంతటితో ఆగింది.. ప్రాణాలకు ఏమైనా అయితే.. అయినా వచ్చీ రాని వంటలు.. యూట్యూబుల్లో చూసి కొత్త కొత్త ప్రయోగాలు. సక్సెస్ రేటు బావున్నా ఇదిగో ఇలాంటివి వింటుంటే.. వామ్మో ఇలాకూడా జరుగుతుందా అని కొంత ఆశ్చర్యం.. మరికొంత భయం. ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ అనే యువతి డెలీష్ అనే వెబ్‌సైట్‌లో చూసి కోడిగుడ్డు కూరను ట్రై చేస్తోంది. అచ్చంగా అందులో చెప్పినట్టే మైక్రోవేవ్ ఓవెన్‌లో గుడ్లు పెట్టింది. అవి పేలకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలని అందులో ఉంది. దాంతో ఆమె కూడా అలాగే చేసి ఓవెన్‌లో పెట్టింది.

గుడ్లు అందులో ఉన్నంత సేపు బానే ఉన్నాయి. బయటకు తీసిన వెంటనే ఢాం అని పేలిపోయాయి. దీంతో ఆమె ముఖంలోని కుడివైపు భాగం కాలిపోయింది. కన్ను వాచిపోయి మూసుకుపోయింది. ముఖం అంతా మంట, నొప్పి. అంత బాధలోనూ ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేసింది. కాల్ రిసీవ్ చేసుకున్న వైద్య సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యం ఏమాత్రం ఆలస్యమైనా ఆమె కంటిచూపు కోల్పోయే పరిస్థితి వచ్చేదని వైద్యులు తెలిపారు.

ఓవెన్‌లో గుడ్లు పేలతాయి. వంట చేసేటప్పుడు జాగ్రత్త అని కజిన్ ఇదివరకు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టింది. అప్పుడు గుడ్డు పేలింది కానీ ఆమెకు ఏమీ కాలేదు. ఆ ధైర్యంతోనే తానూ ట్రై చేసింది. కానీ తన టైం బాలేదు. అందుకే ఇలా అయ్యింది. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. గుడ్లు పేలి ముఖానికి అంటుకోగానే చర్మం ఊడిపోతున్నట్లు అనిపించిందని, దాంతో భయంతో కేకలు పెట్టానని తెలిపింది. ప్రస్తుతం రాసర్ గాయాల నుంచి కోలుకుంటోంది. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు కదా. అదీ సంగతి. అందుకే ఓవెన్‌లో గుడ్డుతో ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్త సుమండీ.

Tags

Read MoreRead Less
Next Story