పాకిస్థాన్‌కు మరో షాక్.. వక్రబుద్ధి చూపినా ఆటలు సాగలేదు..

పాకిస్థాన్‌కు మరో షాక్.. వక్రబుద్ధి చూపినా ఆటలు సాగలేదు..

పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటే మిగిలింది. అంతర్జాతీయ సమాజం నుంచి మళ్లీ మొండిచెయ్యే దక్కింది. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న పాక్‌..మరో సారి తన వక్రబుద్ధి చూపెట్టినా దాని ఆటలు సాగలేదు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీరుకు ఉన్న హోదా రద్దు, రాష్ట్ర విభజన తరువాత ఆ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాక్‌ చేసిన యత్నం ఫలించలేదు. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి కశ్మీర్‌ అంశాన్ని తీసుకెళ్లగలిగినా సభ్యదేశాలన్నింటి మద్దతు సాధించడంలో దాయాది దేశం విఫలమైంది. పాక్‌ బాధను భుజాలకెత్తుకున్న చైనాకూ భంగపాటు ఎదురైంది.

కశ్మీర్ అంశంపై యూఎన్‌ భద్రతామండలిలోని 15 సభ్యదేశాల మధ్య 73 నిమిషాల పాటు రహస్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌‌ను బలపరుస్తూ చైనా చేసిన వాదనకు రష్యా చెక్ పెట్టింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని, జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు దారునంగా ఉన్నాయని చైనా వాదించింది. అయితే రష్యా భారత్‌కు పూర్తి మద్దతుగా నిలిచింది. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని రష్యా స్వాగతించింది. ఈ అంశంపై యూఎన్ భద్రతా మండలిలో చర్చించొద్దని తేల్చి చెప్పింది. భద్రతామండలిలోని మిగతా దేశాలు కూడా కశ్మీర్‌పై పాకిస్థాన్‌ వాదనను వ్యతిరేకించాయి. రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కూడా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో పాక్‌కు చైనా తప్ప వేరే ఏ దేశమూ మద్దతివ్వని పరిస్థితి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్న చైనా వాదనను అన్ని దేశాలూ వ్యతిరేకించాయి. మరోవైపు సంప్రదింపులకు తమనూ అనుమతించాలని, నియమావళిలోని 37వ నిబంధన ప్రకారం.. తమను లోనికి రానివ్వాలని పాక్ కోరినా ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న దేశం పోలెండ్‌ అందుకు తిరస్కరించడంతో దాయాదికి మరో దెబ్బ తగిలింది.

ఆర్టికల్ 370 రద్దుతో భారత్ కశ్మీర్‌పై అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్న పాక్..మొదట అమెరికా తలుపు తట్టినా..అక్కడా మద్దతు లభించలేదు. కశ్మీర్ విషయం భారత్ అంతర్గతమని అమెరికా తేల్చి చెప్పడంతో చైనాకు సాగిలపడింది. ఇప్పుడు యూఎన్ సాక్షిగా మరోసారి పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Tags

Read MoreRead Less
Next Story