ఘనంగా ఐదుగుళ్ల పోచమ్మతల్లి బోనాలు మహోత్సవాలు

హైదరాబాద్‌లోని BHEL రామచంద్రపురంలో ఐదుగుళ్ల పోచమ్మతల్లి బోనాల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవానికి పోటెత్తిన భక్తులతో తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద రద్దీ కనిపిస్తోంది. అమ్మవారికి టీవీ5 ఛైర్మన్ BR నాయుడు సతీమణి, హిందూధర్మం ఎడిటర్ విజయలక్ష్మి, ఎండీ రవీంద్రనాథ్, వీసీ సురేంద్రనాథ్ దంపతులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించారు. టీవీ5 మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి కూడా పూజాదికాల్లో పాల్గొన్నారు. ఏటా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం టీవీ5 యాజమాన్యానికి ఆనవాయితీగా వస్తోంది.
బోనాల సందర్భంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించేందుకు భారీ ఊరేగింపు జరిగింది. కుమ్మరి, గౌడ, గొల్ల, కురుమ సంఘాల ప్రతినిధులు ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా నైవేద్యం సమర్పిస్తారు. రాత్రికి ఫలహార బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగుస్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విశేష పూజలందుకుంటున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com