పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి.. 63 మంది మృతి

పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి.. 63 మంది మృతి

ఆఫ్గనిస్థాన్‌లో ముష్కర మూక మారణహోమానికి తెగబడింది.. ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది.. దీంతో సంతోషాల మధ్య సాగుతున్న పెళ్లి వేడుక ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. క్షణాల్లోనే శవాల దిబ్బగా మారిపోయింది.. చెల్లాచెరుదుగా పడి వున్న మృతదేహాలు.. తెగిపడిన శరీర భాగాలు క్షణాల వ్యవధిలో అంతా భయానక వాతావరణం కనిపించింది. ఆప్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ మారణ హోమం ఆ దేశాన్ని వణికించింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చనిపోగా.. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, పేలుడులో వధూవరులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

ముందుగానే రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులు.. పక్కా ప్లాన్‌తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.. పెళ్లి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జనం ఉంటారని, రక్షణ ఏమాత్రం ఉండదని ముందుగానే ఊహించిన ఉగ్రవాదులు.. దాడికి తెగబడ్డారు. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు సంతోషంగా డ్యాన్సులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. తేరుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో జనమంతా ఆర్తనాదాలు చేసుకుంటూ పరుగులు పెట్టారు. అటు ఈ మారణహోమానికి తామే బాధ్యులమంటూ ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిని ఆఫ్గనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తీవ్రంగా ఖండించారు. అనాగరిక చర్యగా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story