కన్నతండ్రిని చంపిన కిరాతకుడు

కన్నతండ్రిని చంపిన కిరాతకుడు

పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడని చెబుతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ కసాయి కొడుకు కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో నింపేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘోరం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. అటు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జన్మనిచ్చిన పాపానికి కన్నతండ్రినే హత్యచేశాడో కిరాతకుడు.. అంతటితో ఆగకుండా శవాన్ని ముక్కలుగా నరికి మూడు బకెట్లలో కుక్కేశాడు.. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన పెను సంచలనంగా మారింది.. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.

రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్డ్‌ అయిన మారుతి సుతార్‌ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. పెద్ద కూతురికి పెళ్లి కాగా.. మరో కూతురు, కొడుకు కిషన్‌ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. చెడు అలవాట్లకు బానిసగా మారిన కిషన్‌ జులాయిగా తిరుగుతున్నాడు. పనీ పాటా లేకుండా తిరుగుతుండటంతో కిషన్‌ను అతని తండ్రి మారుతి తరచూ మందలిస్తుండేవాడు. ఈ విషయంలో పలుమార్లు ఇద్దరి మధ్యా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్టుగా సమాచారం. సహనంకోల్పోయిన కిషన్‌.. తండ్రి అని కూడా చూడకుండా మారుతిపై దాడి చేశాడు. కత్తితో అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత విషయం బయటకు తెలుస్తుందన్న అనుమానంతో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. శరీర భాగాలను ఏడు బకెట్లలో కుక్కి మూతపెట్టేశాడు. మూడ్రోజుల తర్వాత ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బకెట్లు ఓపెన్‌ చేయడంతో మారుతి శరీర భాగాలు కనిపించాయి.

మరోవైపు హత్య జరిగిన సమయంలో కిషన్‌ తల్లి, చెల్లి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. వారు హత్య విషయాన్ని ఎందుకు దాచి పెట్టారనేది తెలియాల్సి ఉంది. తమనూ ఎక్కడ చంపేస్తాడోననే భయంతో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఇద్దరు మహిళలు పోలీసులకు వివరించారు. అటు పోలీసుల రాకను ముందే గమనించిన కిషన్‌ అక్కడ్నుంచి పరారయ్యాడు. పరారీలో వున్న కిషన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు పట్టుబడితే గానీ అసలు విషయం బయటకు రాదని పోలీసులు చెబుతున్నారు. 302 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అటు క్లూస్‌ టీమ్‌ కూడా వివరాలను సేకరించింది. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తండ్రిని ఇంత దారుణంగా చంపిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story