వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు లేవు : చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. వేమూరు నియోజకవర్గం వెల్లటూరు గ్రామం నుంచి కిష్కింద పాలెం, చింతపోటు జువ్వల పాలెం తదితర గ్రామాల మీదుగా ఆయన పర్యటన సాగింది. జోరు వానలో తడుస్తూనే ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులు సైతం వర్షంలో తడుస్తూ బాబు పర్యటనలో పాల్గొన్నారు. వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు చేపట్టలేదని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిలదొక్కుకునే వరకు అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వాయర్‌లు అన్నీ ఖాళీగా ఉన్నా నిల్వ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓ పద్దతి ప్రకారం నీరు వదలితే ఇబ్బంది వచ్చేది కాదని చంద్రబాబు వెల్లడించారు. తను ఉంటున్న ఇంటిని ముంచాలన్న లక్ష్యంతో ప్రజలను ముంచారని మండిపడ్డారు.
వేమూరు నియోజకవర్గంలో ముంపు ప్రాంత ప్రజలు తమ గోడును చంద్రబాబు ముందు వెళ్లబోసుకున్నారు. నీటిలోనే ఇంకా తమ ఇళ్లు నానుతున్నా.. మంత్రులు కాని, అధికారులు కాని తమవైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు, మిర్చి,కంద,అరటి, పూల తోటలను చంద్రబాబు పరిశీలించారు. నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా నీరు వదలడం వల్లే నష్టపోయామని రైతులు వాపోయారు. ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, పంటలు మొత్తం కోల్పోయామని బాబు వద్ద రైతులు ఆవేదన వెల్లబుచ్చారు.
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన టీడీపీ ఎప్పుడూ ఉంటుందని చంద్రబాబు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com