నా ప్రాణం ఖరీదు ఎంతంటే.. - చిరంజీవి

నా ప్రాణం ఖరీదు ఎంతంటే.. - చిరంజీవి

స్వయంకృషికి చిరునామా అతడు. ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ పోషించి బాక్సాఫీస్ తో పాటు అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా.. ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను హిట్లర్ లా రూల్ చేస్తోన్న ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లెంతమంది..? తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించిన వెండితెర రారాజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ (ఆగస్టు 22 ).

మెగాస్టార్ చిరంజీవి .. ఎన్నో మైలు రాళ్లు దాటి.. అవమానాలు సహించి.. ఎన్నో ఛాలెంజ్ లను స్వీకరించి.. రివార్డులు పొంది.. ఎన్నో రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. అంతేనా .. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు.. నలభైయేళ్ల క్రితం.. నలుగురు.. ఐదుగురులో ఒకడిగా మొదలై.. టాలీవుడ్ కే నెంబర్ వన్‌గా మారి.. కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది.

చిరంజీవి ఎస్సెట్ అతని కళ్లు. ఆ కళ్లలో కనిపించే ఫైర్. అందుకే.. ఈ కుర్రాడి కళ్లు భలే ఉన్నాయే అనుకుని వేషాలిచ్చిన వాళ్లూ ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునేవాడి కళ్లలో ఇలాంటి ఫైర్ ఉంటేనే అతను సాధిస్తాడు. అటుపై మెరుపులా కదిలే అతని బాడీ. ఏ ఎక్స్ ప్రెషన్ నైనా పలికించే అభినయం.. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది.

తెలివి, బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా ఉంటే.. ఇక అతని ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చిరంజీవి వినమ్రత నచ్చి అల్లు రామలింగయ్య అల్లుడిగా చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోని అతి ముఖ్యుల్లో ఒకరు. అయితే అండ దొరికింది కదా అని చిరంజీవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. అంచెలంచెలుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతూ వెళ్లాడు. ఒక దశలో చిరంజీవి డేట్స్ కావాలంటే అడ్వాన్స్ లు ఇచ్చిన వారికి కూడా మూడు నాలుగేళ్లు పట్టేంతగా అతని ఇమేజ్ పెరుగుతూ పోయింది.

మరి అంత ఇమేజ్ ఉన్నా చిరంజీవికి ఫ్లాపుల్లేవా.. అంటే ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఎంతో ఇమేజ్ ఉన్న తనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అన్ని ఫ్లాపులు వచ్చాయి. ఒక దశలో ఇక చిరంజీవి పని ఐపోయింది అన్నవాళ్లూ ఉన్నారు. అందుకు కారణం.. చేదు అయినా నిజం చెప్పాలంటే ఇమేజ్ వల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సే. కొంత గ్యాప్ తీసుకుని.. కేవలం ఆ ఓవర్ తీసేసి మళ్లీ తనదైన కాన్ఫిడెన్స్ తో మొదలుపెట్టాడు.. మళ్లీ హిట్లర్ రూలింగ్ మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story