ఆంధ్రప్రదేశ్

వైసీపీ సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ..

వైసీపీ సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ..
X

పోలవరం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని.. ప్రాజెక్టు అంచనాలు అమాంతం పెంచారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆరోపణలు గుప్పించింది. తమ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ చేపడతామని ప్రకటించింది. అన్నట్లుగా అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆఘా మేఘాల మీద పోలవరం ప్రాజెక్ట్‌ పనుల నుంచి నవయుగను తప్పించి.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పోలవరం విషయంలో రివర్స్‌ టెండరింగ్ వద్దంటూ ఈమేధ్యే ప్రాజెక్టు అథారిటీ నెత్తీనోరూ బాదుకుంది. కేంద్రం కూడా రివర్స్‌ టెండరింగ్‌ సరికాదని హితవు పలికింది. దీని వల్ల ప్రాజెక్ట్‌ అంచనా పెరిగి నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని హెచ్చరించింది. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రివర్స్‌ టెండరింగ్‌పై మొండిగా ముందుకెళ్లింది. ఇప్పుడు హైకోర్టులోను సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ మిగిలిన పనులకు 18 వందల 87 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు 3 వేల 100 కోట్లు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇనిషియల్ బెంచ్ మార్క్‌గా 4వేల 900 కోట్లుగా నిర్ణయించి అధికారులు నోటిఫికేన్ జారీ చేశారు. అయితే.. ఇందులో హైడల్ ప్రాజెక్టును నవయుగ కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. అయితే ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది నవయుగ సంస్థ. దీంతో ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వానికి గట్టి జలక్‌ ఇచ్చింది. రివర్స్‌ టెండరింగ్ విధానంలో ముందుకు వెళ్లవద్దంటూ జగన్ ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు.. నవయుగ కాంట్రాక్టు సంస్థకు ఇచ్చిన హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్‌ చేసింది.

హైకోర్టు తీర్పుపై టీడీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. కోర్టు తీర్పు జగన్ సర్కారుకు చెంపపెట్టు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పేందుకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోందని ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పుతోనైనా పాలకులకు కనువిప్పు కలగాలన్నారు టీడీపీ నేతలు.

పోలవరం విషయంలో హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టుకు నష్టమని.. దీనిపై సర్కార్ ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో, రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని అన్నారు. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కేంద్రం చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కాకపోతే ఎలాగని ప్రశ్నించారు. లేని అవినీతిని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్‌పై మండిపడ్డారు చంద్రబాబు.

కోర్టు తీర్పుపై అటు బీజేపీ కూడా స్పందించింది. హైకోర్టు ఆదేశాలతో సర్కారు నిర్ణయం తప్పని తేలిపోయిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏల అంశంలో కేంద్రం సూచనలను జగన్‌ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ కాస్తా హైకోర్టులో రివర్స్‌ కావడంతో వైసీపీ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story

RELATED STORIES