ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు

ఉడాన్‌ పథకం కింద కొత్తగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారులు.. ఇందూరుతోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. అటు దశాబ్దం కిందటి ప్రతిపాదనలు ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటు అంశం ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ అంశం తెరమీదకు రావడం.. ఆ తర్వాత మరుగున పడటం కామన్‌గా మారింది. అయితే, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎయిర్‌పోర్టులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారులు రాష్ట్రంలో ప్రతిపాదిత స్థలాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో అధికారులు పర్యటించారు.

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం జక్రాన్‌పల్లిలో భూములను పరిశీలించింది. ఇక్కడికి రోడ్డు, రైలు రవాణా సదుపాయాల గురించి అధికారులు ఆరా తీశారు. జక్రాన్ పల్లితో పాటు కొలిప్యాక్, ఆర్గుల్ మనోహరాబాద్‌, తొర్లికొండ శివారు ప్రాంతాలను కూడా పరిశీలించారు. స్థానిక భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ వారికి వివరించారు. విమానాశ్రయానికి 16 వందల ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు.

వ్యవసాయాధారిత జిల్లా కావటం.. విభిన్న పంటల సాగుతో మెరుగైన దిగుబడులు సాధిస్తున్న క్రమంలో ఇక్కడ ఆహార అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ప్రయాణ సౌకర్యంతో పాటు వాణిజ్యపరంగా భవిష్యత్తులో అడుగులు పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ప్రతినిధి బృందం కూడా జక్రాన్‌పల్లి భూమి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పడంతో విమానాశ్రయం ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడినట్టేనని ఇక్కడి ప్రజలంటున్నారు.

అంతకు ముందు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. ఏరోడ్రమ్‌ దగ్గరున్న స్థలం, విమానాల రాకపోకలకు అనువైనదో కాదో తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలంతో పాటు ప్రైవేట్ భూమి ఎంత కావాలనే విషయాలతో పాటు నెల రోజుల్లో DPRను ప్రభుత్వానికి అందిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఆదిలాబాద్‌కు విమానాశ్రయం ఎంతో అవసరమని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు వివరించారు ఎంపీ సోయం బాపురావు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ ఇస్తే, ప్రధానితో మాట్లాడి విమానాశ్రయం పనులు ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. మొత్తంగా రెండు జిల్లాల్లో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాలపై సానుకూలత వ్యక్తం చేసిన అధికారులు.. పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి సెప్టెంబరులో ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Tags

Next Story