'సచివాలయ' పరీక్షకు రెడీ అయ్యారా.. పరీక్షకు సంబంధించి కొన్ని..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష తేదీ దగ్గరకొచ్చేసింది. సరిగ్గా వారం రోజుల్లో మొదలు కానున్న తరుణంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు.. అభ్యర్థులు సాధ్యమైనంత మేరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు.
ఎటువంటి అవకతవకలకు ఆస్కారమివ్వకూడదని అభ్యర్థి సొంత మండల పరిధిలో కాకుండా పక్క మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మందికి పరీక్షా కేంద్రాలను కేటాయించారు. రెండు మూడు రోజుల్లో హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తాం. పరీక్ష కేంద్రం ఎక్కడనేవి ఒక్క రోజు ముందు మాత్రమే వెల్లడించడం జరుగుతుంది. అభ్యర్థికి పరీక్ష గది కేటాయింపు రెండు మూడు గంటల ముందు మాత్రమే నిర్ణయిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు వీడియో కెమెరాలు వుంటాయి. కంప్యూటర్ ద్వారానే ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ జరుగుతుంది. రెండు సార్లు స్కాన్ చేసి, ఫలితాన్ని క్రోడీకరించుకుంటుంది. రాత పరీక్ష ఫలితాల మార్పులు చేర్పులకు ఎలాంటి అవకాశం ఉండదు.
ఒకే అభ్యర్థి ఒకే రోజు రెండు వేర్వేరు ఉద్యోగాలకు జరిగే రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటే ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. అభ్యర్థులు రెండున్నర గంటల పాటు పరీక్ష కేంద్రంలో ఉండాల్సిందే. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించరు. కంటి చూపు, రెండు చేతులు లేని వారికి సహాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి అదనంగా మరో 50 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి పేరు, ఇతర వివరాలు, అతని హాల్ టిక్కట్ నెంబర్‌తో సహా ఓఎమ్మార్ షీట్ ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీటన్నింటిని ఆయా జిల్లాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రూముల వద్ద 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com