చంద్రయాన్‌2 శాటిలైట్‌ నుంచి ఇస్రోకి తొలి ఫోటో

చంద్రయాన్‌2 శాటిలైట్‌ నుంచి ఇస్రోకి తొలి ఫోటో

అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఇస్రో.. మరో సక్సెస్ ఫుల్ ఫీట్ కోసం వెయిట్ చేస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా మరికొద్దిరోజుల్లోనే చంద్రుడిపైకి ల్యాండర్ దిగనుంది. భారత్ ప్రయోగించిన తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ ప్రాజెక్ట్ కావటంతో ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

చేపట్టిన ప్రాజెక్టును సక్సెస్ చేయటంలో మంచి పేరున్న ఇస్రో.. చంద్రయాన్ 2 తర్వాత చంద్రయాన్ -3 కి కూడా రెడీ అంటోంది. ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. చంద్రయాన్ 2లో ల్యాండర్ ను పంపించిన ఇస్రో, చంద్రయాన్-3 లో లూనర్ రోవర్, ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపించనున్నారు. జాబిల్లిపై దక్షిణ ధృవంలోని మట్టి, రాళ్ల నమూనాలను తీసుకురానున్నారు. దీంతో చంద్రుడిపై గడ్డకట్టిన రూపంలో నీరు ఉందా? అక్కడి రాళ్లలో ఇతర నిక్షేపాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించనున్నారు.

అంతా అనుకున్నట్టే జరిగితే చంద్రయాన్ 3 ఇక పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. జపాన్ అంతరిక్ష సంస్థ జెక్సాతో కలిసి ఇస్త్రో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. జపాన్ లూనర్ రోవర్ ను, భారత్ ల్యాండర్ అందించనున్నారు. అలాగే జపాన్ లాంచ్ వెహికల్ H3ని సమకూర్చనుంది. ప్రస్తుతం ఈ లాంచ్ వెహికల్ ప్రయోగదశలోనే ఉంది. చంద్రయాన్-3 కి సంబంధించి రెండు దేశాల మధ్య పూర్తిస్థాయిలో అవగాహన రావాల్సి ఉంది. బడ్జెట్ కేటాయింపులు కూడా ఇక ఫైనల్ కావాల్సి ఉంది. అంతా పక్కాగా జరిగితే గగన్ యాన్ తర్వాత 2024లో చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహించనున్నారు.

మరోవైపు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం చంద్రుడిని ఫోటో తీసి పంపింది. చంద్రయాన్‌-2 చంద్రుడ్ని తీసిన తొలి ఫోటో ఇదేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలానికి 2,600 కిలోమీటర్ల ఎత్తులో తీసిన ఈ ఫోటోలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని ఇస్రో గుర్తించింది. అటు చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహ కక్ష్యను మరింత తగ్గించింది ఇస్రో. సెప్టెంబర్ ఏడు తెల్లవారు జామున ల్యాండర్ ల్యాండ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story