నడిపించే నాన్న లేడు.. ఆడించే అమ్మ ఉన్నా ఆమెకీ..

నడిపించే నాన్న లేడు.. ఆడించే అమ్మ ఉన్నా ఆమెకీ..

తప్పొకరిది.. శిక్షమరొకరికి. పరుగులు పెట్టే తన ఈడు పిల్లలు తన పక్కనే ఉన్నా తడబడే తప్పటడుగులు తప్ప గట్టిగా నాలుగు అడుగులు వేయలేడు. పోనీ అమ్మ సాయం తీసుకుందామంటే ఆమె పరిస్థితీ అంతంత మాత్రమే. అభం శుభం తెలియని ఆ చిన్నారికి ఆడుకునేందుకు బొమ్మలు లేవు.. కబుర్లు చెప్పేందుకు చెల్లిలేదు.. నడిపించేందుకు నాన్న లేడు.. అయినా అవేమీ తెలియని ఆ పసి ప్రాయం ఆసరా కోసం ఆశగా ఎదురు చూస్తోంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ చెందిన హైదర్ భార్య షహీదా బేగం, కొడుకు రేహాన్, కూతురు రిషాతో కలిసి ద్విచక్రవాహనంపై సంగారెడ్డి ఆసుపత్రికి వెళుతున్నారు.

రేహన్‌కు వైరల్ ఫీవర్ రావడంతో డాక్టర్‌కి చూపించడానికని బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బండి టైరు పగిలింది. దాంతో వాహనం డివైడర్‌ను ఢీకొని నలుగురూ రోడ్డుకు అవతలి వైపు ఎగిరిపడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ చక్రాల కింద పడి ఏడాది వయసున్న రిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రేహాన్ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తల్లి షహీదాబేగం కాళ్లు విరగ్గా, తండ్రి హైదర్‌కు స్వల్పగాయాలయ్యాయి. వైద్యులు రేహాన్ రెండు కాళ్లను తొలగించారు. షహీదాకు ఆపరేషన్ చేసి నాలుగు రాడ్లు వేశారు. మొత్తం రూ. 4 లక్షలు ఖర్చయింది. వైద్యం కోసం అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగాయి. షహీదా కాళ్లలో ఉన్న రాడ్లను తొలగించేసరికి ఇన్‌ఫెక్షన్ అయింది. చికిత్సకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.

అప్పులు తీరే మార్గం కనిపించట్లేదు. నావల్ల కాదు ఈ సంసారాన్ని ఈదడం అని ఏడాది క్రితం హైదర్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కనీస కనికరం లేకుండా, ఎలా బతుకుతారన్న ఆలోచన లేకుండా భార్యా బిడ్డల్ని వారి మానాన వారిని వదిలేసి వెళ్లిపోయాడు. ఏ దిక్కూ లేని షహీదా కొడుకుని తీసుకొని పుట్టింట్లో ఉన్న 70 సంవత్సరాల తండ్రి పంచన చేరింది. ఆమె బాధను ఆలకించిన హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య ఫౌండేషన్ వారు రేహాన్‌కు కృత్రిమ కాళ్లను అందించారు. అందులో ఒకటి విరిగిపోవడంతో ఫెవీక్విక్‌తో అతికించినా ఉపయోగం లేదు. గుండెల్లో బాధ.. కాళ్లలో నొప్పులు.. అయినా నాలుగు అక్షరముక్కలైనా నేర్చుకుంటాడని కొడుకుని బడికి పంపిస్తోంది షహీదా. ప్రభుత్వం ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. మనసున్న మారాజులెవరైనా స్పందిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story