పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయి : పీపీఏ

ఏపీ ప్రభుత్వ తీరును మరోసారి తప్పు పట్టింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పోలవరానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పీపీఏ స్పష్టం చేసింది. కేంద్రానికి నివేదిక అందజేసిన పీపీఏ.. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని పేర్కొంది. మొత్తం 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది.
పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల జరిగే నష్టాలను నివేదికలో పీపీఏ సవివరంగా పొందుపరిచింది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జాప్యం కొనసాగితే పోలవరం ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని పేర్కొంది. దీంతో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయని పీపీఏ అభిప్రాయపడింది.
పోలవరం టెండర్ల రద్దుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని.. కోర్టు స్టేను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బు చెల్లించేది కేంద్ర ప్రభుత్వమని.. ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం పని కేంద్రం చేస్తుంది.. రాష్ట్రం పని రాష్ట్రం చేయాలి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com